హైదరాబాద్: క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరుతో నగరానికి ఓ బాధితురాలికి సైబర్ నేరగాళ్లు వల విసిరారు. దాంతో ఆమె రూ.7.50 లక్షలు మోసపోయింది. వివరాలల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. మీ క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బెదిరించాడు. దాంతో బాధితురాలు నాకు క్రెడిట్ కార్డు లేదని చెప్పింది. అయితే కస్టమర్ కేర్ తో మాట్లాడాలని సూచించి మరోవ్యక్తికి నేరగాడు కాల్ ఫార్వర్డ్ చేశాడు. అతను బాధితురాలి ఆధార్ తనిఖీ చేసి.. ముంబయి, తమిళనాడు, బిహార్తో పాటు మరోప్రాంతంలో ఆమె పేరిట క్రెడిట్ కార్డులు ఉన్నాయని, వాటి నుంచి రూ.25-30 లక్షల నగదు బదిలీ జరిగిందని బెదిరించాడు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు నమోదవుతుందని భయపెట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని, సీబీఐ విచారిస్తున్నప్పుడు విషయం చాలా రహస్యంగా ఉంచాలని సూచించాడు.
Also read ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కుమార్తె మృతి
ఆ మాయ మాటలను యువతి నమ్మింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని, తాము సూచించిన అకౌంట్కు రూ. 7.50 లక్షలు బదిలీ చేయాలన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పారు. దాంతో యువతి డబ్బు చెల్లించింది. బాధితురాలు తన మిత్రులతో ఈ విషయాన్ని పంచుకోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించింది. న్యాయం చేయాలని సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.