July 3, 2024
SGSTV NEWS
CrimeTelangana

తెలంగాణ లో  వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు.. కనిపించిన సీన్ చూసి షాక్!

జాతీయ పక్షి నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిపేరే షికార్ అన్న బిరుదును తెచ్చుకున్న ఘరానా హంటర్ అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కాడు. గతంలో దుప్పుల వేట కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ, తన వ్యాపకం నుండి మాత్రం బయటపడలేదు. జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

జిల్లాలోని పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా నెమళ్లను వేటాడి తన వాహనంలో తీసుకొస్తున్న సత్యనారాయణ అనే వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో విచారించారు పోలీసులు. మండలంలోని దోమలకుంట సమీపంలో నెమళ్లను వేటాడి వాటిని తీసుకుని తన స్వగ్రామానికి వెల్తుండగా పోలీసుల తనిఖీల్లో రెడ్ హైండడ్ గా పట్టుబడ్డాడు. నిందితుడి నుండి 0.22 ఎంఎం గన్‌తోపాటు 34 రౌండ్ల తూటాలు, ఒక గొడ్డలి, కారు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు సత్యనారాయణ గతంలో పెద్దపల్లి జిల్లా బేగంపేట ప్రాంతంలో నివాసం ఉంటూ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు. 2017లో రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన దుప్పుల వేటలో ప్రధాన నిందితుడు సత్యనారాయణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వాయిపేట శివార్లలో దుప్పుల వేట ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో దుప్పులను వేటాడుతున్న క్రమంలో అటవీ అధికారులు దాడులు చేయడం… సినిమా ఫక్కీలో వేటగాళ్లు తప్పించుకోవడంతో వేటకు బలైన దుప్పులను, కారును స్వాధీనం చేసుకున్నారు అటవీ అధికారులు. ఆ తరువాత పోలీసు అధికారులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో షికార్ సత్యం కూడా ఈ కేసులో ఉన్నాడని గుర్తించారు. అప్పుడు భూపాలపల్లి ఉమ్మడి జిల్లాలోనే షికార్ సత్యం తనయుడు సీఐగా పనిచేశాడు. ఈ ఘటన అప్పట్లో అసెంబ్లీనే కుదేపిసింది. ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు అటవీ అధికారుల తీరుపై ఆరోపణలు రావడంతో పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో మహదేవపూర్ ప్రాంతానికి చెందిన వారితో పాటు షికార్ సత్యం కూడా ఉన్నాడని వెలుగులోకి వచ్చింది.

తాజాగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి వద్ద వాహనాల తనిఖీలో జాతీయ పక్షి నెమళ్లను వేటాడి పట్టుకొస్తూ పోలీసులకు చిక్కాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో నివాసం ఉంటున్న షికార్ సత్యం వద్ద అనుమతి లేకుండా వినియోగిస్తున్న తుపాకీతో జాతీయ పక్షులను వేటాడుతున్నట్టు తేటతెల్లమైంది. దీంతో సత్యంను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే షికారి సత్యం దోమలకుంటలో వన్యప్రాణులను వేటాడడం ఇదే తోలిసారా..? గతంలోనూ ఈ ప్రాంతంలో హంటింగ్ చేశాడా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో గుట్టలు విస్తరించి ఉండడంతో వన్యప్రాణులు అక్కడే దొరుకుతాయని గుర్తించిన సత్యం ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే షికార్ సత్యం ఈ ప్రాంతంలో వేటాడడం ఇదే తొలిసారా లేక గతంలోనూ హంటింగ్ చేసి ఉంటాడా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది..!

సొంతగా బర్మర్లు కూడా తయారు చేయగల సత్తా ఉన్న షికార్ సత్యం రన్నింగ్ వాహనంలో ట్రావెల్ చేస్తూ వన్యప్రాణులను వేటాడడంలో దిట్ట అని ప్రచారం. గురి తప్పకుండా పరిగెత్తే ప్రాణులను వాహనంలో వెంటాడి వేటాడడంలో అత్యంత నిపుణుడని కూడా తెలుస్తోంది. అయితే తాజాగా ఆయన నెమళ్లను వేటాడానికి అసలు కారణం ఏంటన్న విషయం కూడా తేలాల్సి ఉంది. సాధారణంగా దుప్పులు, జింకలు వంటి ప్రాణులను వేటాడి గిఫ్ట్ ప్యాక్ పంపిచే ఆనవాయితీ కూడా ఈయనకు ఉందట. ఎక్కువగా అలాంటి ప్రాణులనే టార్గెట్ చేస్తాడని తెలుస్తోంది. ఈసారి ఆయన నెమళ్లను వేటాడి చంపారంటే ఇవి ఆయన కోసమేనా లేక వేరే వారి కోసమా అన్న చర్చ మొదలైంది. ఈ కేసులో అటవీ అధికారులు కూడా ఎంట్రీ ఇచ్చి వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినట్టయితే మరిన్ని వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also read

Related posts

Share via