Bhadrachalam Crime News:ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బంగారం లాంటి భవిష్యత్ ని నాశనం చేసుకుంటున్నారు.
ప్రతి మనిషి జీవితంలో ఎదో ఒకటి సాధించాలని కలలు కంటారు. ఆ కల సాకారం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. మొత్తానికి తమ కల సాకారం చేసుకునే వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. మరికొంతమంది ఏదో సాధించాలి.. సమాజానికి మంచి చేయాలని కలలు కంటారు.. కానీ ఆ కల నెరవేరకుండానే తనువు చాలిస్తుంటారు. ఓ నర్సింగ్ విద్యార్థిని సమాజానికి తనవంతు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ చేరింది. కాలేజ్‌లో ఉపాధ్యాయులు, తన సహ విద్యార్థులతో ఎప్పుడూ సంతోషంగా మాట్లాడుతూ ఉండేది. కానీ.. ఆ యువతి విషయంలో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ అమ్మాయికి ఏం జరిగిందన్న విషయం గురించి తెలుసుకుందాం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరంలో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్ కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) నర్సింగ్ కాలేజ్ లో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. గురువారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఓ విద్యార్థిని బాత్ రూమ్ కు వెళ్లేందుకు బయటకు రాగా కారుణ్య కాలేజ్ ఆవరణలో రక్తపు గాయాలతో పడి ఉన్నట్లు గమనించి వెంటనే తోటి విద్యార్థులకు ఆ విషయాన్ని చెప్పింది. అందరూ కలిసి హాస్టల్ వార్డెన్ కి సమాచారం అందించారు. వార్డెన్ వెంటనే 108 వాహనంలో భద్రచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి 8:30 నిమిషాలకు మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే హాస్పిటల్ వద్ద కారుణ్య తల్లిదండ్రుల, బంధువుల ఆందోళనకు దిగారు. కాలేజ్ లో తమ కూతురుకి ఏం జరిగిందన్న విషయం గురించి పూర్తి వివరాలు తెలియజేయాలని.. తమ కూతురు అంత ప్రమాదం జరిగినా కాలేజ్ యాజమాన్యం సరైన సమయంలో స్పందించలేదుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి దళిత సంఘ నాయకులు మద్దతు పలికారు.భద్రచలం ఏ ఎస్పీ హాస్పిటల్ కి చేరుకొని సర్ధి చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, కారుణ్య చనిపోయే ముందు మేడ పైకి వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆమె మేడ పైకి ఎందుకు వెళ్లింది.. పై అంతస్తు నుంచి తానే దూకిందా? ఎవరైనా తోశారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు.