June 29, 2024
SGSTV NEWS
CrimeTelangana

బాప్ రే బాప్.. వర్చువల్ కిడ్నాప్

• సోషల్ మీడియా నుంచి వివరాల సేకరణ.. అధ్యయనం చేశాక ‘పని’ మొదలు

• పిల్లలు అందుబాటులో ఉండని సమయం చూసి తల్లిదండ్రులకు ఫోన్లు

• కిడ్నాప్ చేశాం, వెంటనే డబ్బు పంపాలంటూ బెదిరింపులు

• భయపడి సొమ్ము ట్రాన్స్ఫర్ చేస్తున్న తల్లిదండ్రులు

• తర్వాత తమవారు క్షేమంగానే ఉన్నట్టు గుర్తించి అవాక్కవుతున్న తీరు

• బోగస్ పేర్లు, ఐడీలతో బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డులు

• కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా దొరకని సైబర్ దొంగలు

పాతబస్తీకి చెందిన ఓ యువతి ఇంట్లోంచి బయటికి వెళ్లింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీ కుమార్తెను కిడ్నాప్ చేశామని, తక్షణమే డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టాడు. దీంతో తల్లిదండ్రులు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన అకౌంటు రూ.12 వేలు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే యువతి కిడ్నాప్ కాలేదని, ఆ ఫోన్ కాల్ తప్పుడుదని తేలింది

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పశ్చిమ మండలం పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో పనిచేసే సబ్-ఇన్స్పెక్టర్కు గత వారం ఫోన్కాల్ వచ్చింది. ఓ వ్యక్తి ‘మీ కుమార్తెను కిడ్నాప్ చేశాం’ అన్నాడు. అప్రమత్తమైన ఆయన.. తొలుత తమ కుమార్తె వివరాలు ఆరా తీశారు. ఆమె సురక్షితంగా ఉన్నట్లు గుర్తించి, తప్పుడు ఫోన్కాల్గా తేల్చుకున్నారు.

..సైబర్ నేరగాళ్లకు కొత్త అస్త్రంగా మారుతున్న ‘వర్చువల్ కిడ్నాప్’ ఉదంతాలకు ఉదాహరణలు ఇవి. బాధితుల అత్యాశ, భయం, బలహీనతలను ఆధారంగా చేసుకుని రెచ్చిపోయే సైబర్ నేరగాళ్లు కొత్తగా మొదలుపెట్టినవే ఈ కిడ్నాప్ కాని కిడ్నాపులు. సోషల్ మీడియాలో పోస్టులను గమనించడం ద్వారా.. ఎదుటి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని డబ్బులు దండుకునేందుకు నుసరిస్తున్న సరికొత్త రూట్ ఇది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు

కొన్నాళ్లు అధ్యయనం చేసి రంగంలోకి..

ఇటీవలికాలంలో సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరిగి పోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ తదితర ఖాతాలు ఉంటున్నాయి. లైకులు, కామెంట్లు, ఫాలోవర్ల క్రేజ్లో చాలా మంది వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలనూ పోస్టు చేస్తున్నారు. తమ కుటుంబం, పిల్లల వివరాలు, అభిరుచులు, విద్య, ఉద్యోగం వంటివీ చెప్పేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇవన్నీ నిశితంగా గమనించి ఆయా అంశాల ఆధారంగా ‘వర్చువల్ కిడ్నాప్’ టార్గెట్స్ను ఎంచుకుంటున్నారు. వారిని సంప్రదించడానికి అవసరమైన ఫోన్ నంబర్ను సోషల్ మీడియా ద్వారానే సంపాదిస్తున్నారు.

‘సరైన సమయం’లో ఫోన్లు చేస్తూ..

వివరాల సేకరణ పూర్తయ్యాక సైబర్ నేరగాళ్లు అసలు పని మొదలుపెడుతున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి సంతానం విద్యార్థులైతే పాఠశాలలు/కళాశాలల పనివేళలు, ఉద్యోగస్తులైతే వర్కింగ్ అవర్స్ను ఎంపిక చేసుకుంటున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తులకు ఆ సమయాల్లో ఫోన్ చేసి, పిల్లల్ని కిడ్నాప్ చేశామని బెదిరిస్తున్నారు. ఎదుటివాళ్లు తేరు కునేందుకు, వెనుకా ముందు ఆలోచించేందుకు సమయం ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

కిడ్నాప్ చేసిన వారిని వదిలిపెట్టాలంటే వెంటనే సొమ్మును బ్యాంక్ ఖాతాలు/యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసేది కొంత మొత్తమే కావడంతో బాధితులు తొందరపడి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆపై అసలు విషయం తెలుసుకుని మోస పోయినట్టు గుర్తిస్తున్నారు. ఈ తరహా బాధితుల్లో చాలా వరకు కేసు పెట్టడానికి ముందుకురావడం లేదు కూడా.

బోగస్ పేర్లతో ఖాతాలు, సిమ్కార్డులు

వర్చువల్ కిడ్నాప్ నేరాలకు పాల్పడేవారు ఎట్టి పరిస్థితుల్లో తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లినా దర్యాప్తులోముందుకు వెళ్లకుండా వ్యవహరిస్తున్నారు. ఇతరుల పేర్లతో లేదా బోగస్ వివరాలతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్ నంబర్లను వినియోగిస్తున్నారు.

మన భయమే వాళ్ల పెట్టుబడి..

వర్చువల్ కిడ్నాప్ వ్యవహారంలో బాధితుల భయాందోళనలే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. పాతబస్తీకి చెందిన దంపతుల విషయమే తీసుకుంటే.. వారి కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో సైబర్ నేరగాడు ఫోన్ చేసి కిడ్నాప్ చేసినట్టు బెదిరించాడు. వారు భయపడి కుమార్తెను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో అపహరణ జరిగిందని భయపడ్డారు. కనీసం ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనిగానీ, అమ్మాయి వివరాలేమిటనిగానీ ఆరా తీయలేదు.

సైబర్ నేరగాడు డబ్బు డిమాండ్ చేయగా.. తమ బ్యాంకు ఖాతాలో రూ.12 వేలే ఉన్నాయని చెప్పారు. ఆ మొత్తం పంపినా మీ కుమార్తెను వదిలేస్తామనడంతో.. వెంటనే సొమ్ము యూపీఐ చేశారు. ఈ రోజుల్లో కిడ్నాపర్ అంత చిన్న మొత్తానికి ఒప్పుకోవడం ఏమిటని కూడా ఆలోచించలేదు. తర్వాత హడావుడిగా పోలీసులను ఆశ్రయిస్తే.. అధికారులు యువతి లొకేషన్, ఇతర వివరాలు ఆరా తీసి సురక్షితంగానే ఉన్నట్టు తేల్చారు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయారు.

సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పెట్టొద్దు

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరిగింది. వర్చువల్ కిడ్నాప్ తరహా ఉదంతాలకూ అదే కారణం. ఎవరికి వారు తమ వివరాలు, అలవాట్లు, చేస్తున్న పనులను పోస్టు చేస్తున్నారు. ఇది సైబర్ నేరగాళ్లకు కలసి వస్తోంది. పార్ట్ టైమ్ జాబ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్తోపాటు అనేకరకాల సైబర్ నేరాలకు సోషల్ మీడియా ఖాతాలే ఆధారం అవుతున్నాయి. అందుకే వీలైనంత వరకు ‘బీ లెస్ ఇన్ సోషల్ మీడియా’ అన్నది పాటించాలి. సైబర్ నేరగాళ్లు ప్రలోభపెట్టినా, భయపెట్టినా వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి..” – ఆర్టీజీ శివమారుతి, ఏసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా

Related posts

Share via