Rahu and Guru Transit 2025: మే 18న రాహువు కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఏడాదిన్నర పాటు ఈ రాశిలో రాహువు సంచరిస్తాడు. మే 25న మిథున రాశిలోకి ప్రవేశించనున్న గురువు రాహువును పూర్ణ బలంతో వీక్షించడం వల్ల రాహువులోని చెడు లక్షణాలు బాగా తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారు అత్యధికంగా శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆరోగ్యం మెరుగుపడే అవకాశముంటుంది.
మే 18న రాహువు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి మారడం జరుగుతోంది. ఈ రాశిలో రాహువు ఏడాదిన్నర పాటు సంచారం చేస్తాడు. కుంభ రాశి అధిపతి అయిన శనీశ్వరుడు ఈ రాహువుకు మిత్రుడైనందువల్ల రాహువు కుంభ రాశిలో దాదాపు ఉచ్ఛబలంతో వ్యవహరిస్తాడు. కాగా, మే 25న మిథున రాశిలోకి ప్రవేశించిన గురువు ఈ రాహువును పూర్ణ బలంతో వీక్షించడం వల్ల రాహువులోని చెడు లక్షణాలు బాగా తగ్గే అవకాశం ఉంది. రాహువుపై గురువు వీక్షణ వల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, ధనుస్సు, కుంభ రాశుల వారు అత్యధికంగా శుభ ఫలితాలను పొందడం జరుగుతుంది.
👉 మేషం: ఈ రాశికి లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్న రాహువు ఈ రాశికి ఏలిన్నాటి శని ప్రభావం నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు, ఉద్యోగంలో పదోన్నతులు కలిగిస్తాడు. గురు దృష్టి కూడా పడడంతో ఈ రాహువు మరింతగా ఉద్యోగంలో అందలాలు ఎక్కిస్తాడు. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. మరింత ఉన్నత పదవి, భారీ జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
👉 వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు మీద ధన స్థానం నుంచి గురువు దృష్టి పడడంతో దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, ఆర్థిక కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు ఎక్కువగా విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది.
👉 మిథునం: ఈ రాశిలో ఉన్న గురువు భాగ్య స్థానంలో ఉన్న రాహువును వీక్షించడం వల్ల, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆస్తిపాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. సొంత ఇంటి భాగ్యం కలుగుతుంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి తప్పకుండా అవకాశం ఉంది.
👉 సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు సప్తమ స్థానంలో ఉన్న రాహువును వీక్షించడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత స్థితి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతాయి. సంపన్న కుటుంబంతో ప్రేమలో పడడం, పెళ్లి ఖాయం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
👉 ధనుస్సు: తృతీయ స్థానంలో ఉన్న రాహువు మీద రాశ్యధిపతి గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశివారికి ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఆదాయ ప్రయత్నాలు, ఆదాయ మార్గాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకుంటారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
👉 కుంభం: ఈ రాశిలో సంచారం చేస్తున్న రాహువు మీద పంచమ స్థానం నుంచి గురువు దృష్టి పడినందు వల్ల ఈ రాశివారికి ఏడాది పాటు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే