November 22, 2024
SGSTV NEWS
Spiritual

ఆశ్వీయుజ పౌర్ణమి  శ్రీ వాల్మీకి జయంతి…..!(17.10.24)



వాల్మీకి ఎవరు!? ఎక్కడి వాడు!?

శ్రీరాముడి జీవనయానమే రామాయణం. ఆ మహాగ్రంథమే లేకుంటే రాముడెవరో మనకు తెలిసేది కాదు. అలా తెలిసేలా చేసిన వ్యక్తి వాల్మీకి. ఈ వాల్మీకి వెనుక భిన్న కథనాలు ఉన్నాయి. అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

ఆశ్వీజమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిగా జరుపుతుంటారు. నేడు వాల్మీకి జయంతి. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం.

శ్రీరాముడు అనే మహాపురుషుడి వృత్తాంతాన్ని రామాయణంగా రాసింది ఎవరంటే ఎవరైనా వాల్మీకి మహర్షి అని ఠక్కున చెప్పేస్తారు.  

సంస్కృతంలో మొట్టమొదటి కవి వాల్మీకి. శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నది కూడా ఈయనే నంటారు.

వల్మీకం అంటే పుట్ట. ఆ పుట్ట నుంచి వెలుపలికి వచ్చిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడని కూడా అంటారు.

వాల్మీకి తల్లిదండ్రుల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు తాను పరాశరుడి కుమారుడినని తన రచనల్లో చెప్పుకున్నారు. కానీ వాల్మీకి ఎక్కడా తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు. అయితే….  సీతను రాముడికి అప్పగించే సమయంలో తన గురించిన ప్రస్తావన చేశాడు.

ఉత్తరాకాండలో ఉన్న విషయం ఏమిటంటే… రామా నేను ప్రచేతనుడి ఏడో కుమారుడిని. వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపమూ చేయలేదు, ఎలాంటి అబద్దమూ ఆడలేదు. సీత నిన్ను తప్ప వేరే పరపురుషుడిని ఎరుగదు. నా మాట అబద్ధం అయితే నేను చేసిన తపస్సు అంతా పోతుంది’ అంటాడు.

ఇంతకీ…  ఈ ప్రచేతనుడు ఎవరు? ఆయనది ఏ వంశం? లాంటి విషయాలను కూడా తెలుసు కోవాలి. ‘శ్రీమద్భాగవతం’ లో అతని ప్రస్తావన ఉంది. దీన్ని వేదవ్యాసుడు రాశాడు. రామాయణం త్రేతాయుగంలో జరిగితే భాగవతం రాసిన వేదవ్యాసుడు ద్వాపర యుగం నాటి వాడు. ఇది ఎలా రాశాడన్న ప్రశ్న కూడా కలుగుతుంది. పురాణ రచయితలను భగవంతులుగానే భావిస్తారు. అది ఏ యుగమైనా ఒకటే కదా. ఆ భగవంతుడే వాల్మీకిగానూ, వేదవ్యాసుడిగానూ జన్మించి పురాణాలు రాశాడంటారు.

ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగంలో నారదుడు గానం చేసినట్లు చెప్పారు కదా.. అతను ఎవరు? వారి కుమారులు ఎవరు? అని విదురుడు మైత్రేయునితో అడిగే సందర్భంలో ఈ ప్రశ్న కనిపిస్తుంది. ఇక్కడ తెలిసింది ఏమిటంటే ప్రచేతనుడు విష్ణుభక్తుడు. అతను క్షత్రియుడు. ఆయనకు యజ్ఞయాగాల గురించి నారదుడు ఉపదేశించారు.

ఆ తర్వాత కథా క్రమంలో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమై వరాలివ్వడంతో ధ్రువ వంశ విస్తరణ జరిగింది. వీరు సూర్య వంశస్తులైన బోయలు. వీరి వంశ క్రమం వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేనుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడుగా చెబుతారు.

ఈ ప్రచేతనుడికి పది మంది ప్రాచేతసులు అని ఉంది. వీరి జన్మవృత్తాంతాలు చూస్తే అంగుడి బాధ,  వేనుడి దుశ్చర్యలు, పృథ్వీ రాజు ఔన్నత్యం, నిషాదుడు అడవులలోకి వెళ్లిపోయి కిరాత రాజవ్వటం జరుగుతుంది.
ప్రచేతసుడికి జన్మించిన ఆ 10 మంది ప్రాచేతసులలో 7వ వాడు వాల్మీకి మహర్షి.

నారదుల ఉపదేశంతో తండ్రి, తాతల, ముత్తాతల పూర్వజన్మ సుకృతం, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా మార్చాయి. వాల్మీకిమహర్షికి సంబంధించిన అసలు కథ ఇది.

వాల్మీకి మీద ఎవ్వరూ పెద్దగా పరిశోధనలు చేయకపోవడంతో కట్టుకథలు పుట్టాయి. వాల్మీకి పేరు రత్నాకరుడని, అతను దొంగ , దారి దోపిడీదారుడంటూ పేర్కొన్నారు. మరి కొందరు ఆయన బ్రాహ్మణుడన్నారు. వాల్మీకి అనే శబ్దానికి చీమలపుట్ట అనే అర్థం ఉంది. కఠోర ధ్యానం చేసి పుట్ట పేరుకునేలా తపోముద్రలో ఉన్నాడు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చు.

ఆయన మాంసాహారి కాబట్టి కిరాతుడు అని పేరు వచ్చిందంటారు. కిరాతుడు రిషిగా మారడం జరుగుతుంది కదా. వాల్మీకి పేరు కలిగిన వారు నలుగురైదుగురు ఉన్నారని మరికొందరంటారు.

వారిలో రత్నాకరుడు, అగ్నిశర్మ కూడా ఉండి ఉండవచ్చు. వీరు ఆదికవి వాల్మీకి బోధనలకు ప్రేరితులై తమ పేర్లను వాల్మీకిగా మార్చుకొని ఉండే అవకాశం కూడా ఉంది.

వాల్మీకిమహర్షి ‘ఓం ఐం హ్రీం క్లీo శ్రీo’ అనే బీజాక్షరాలను సరస్వతీ , లక్ష్మి , మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు. వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికం చేసిన భరద్వాజుడు , లవుడు , కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారట.

బ్రహ్మ సమానుడని, రామాయణాన్ని రాయటానికి బ్రహ్మ తానే వాల్మీకి మహర్షిగా అవతరించాడని నమ్మేవారు కూడా ఉన్నారు.

ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే ‘అక్షరలక్ష’ అనే ఈనాటి ఎన్సైక్లోపెడియా ఆఫ్ బ్రిటానికా లాంటి విజ్ఞాన సర్వస్వన్ని అందించారు.  యోగవాశిష్టం అనే యోగా , ధ్యానం గురించిన మరో పుస్తకాన్ని కూడా వాల్మీకి రాశారు.

ఈ పుస్తకం రామాయణంలో భాగమే. రాముడు పది – పన్నెండేళ్ల వయసులో మానసిక అశాంతికి లోనైనప్పుడు వశిస్టుడి ద్వారా యోగా, ధ్యానం శ్రీరాముడికి బోధించారు. వశిష్ఠుడు పలికిన విషయాలనే వాల్మీకి రాశాడు. ఆదిత్య హృదయం రాసింది కూడా వాల్మీకి మహర్షే.

వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడినని వాల్మీకి పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు , సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ఆశ్రమంలోనే సీత లవ – కుశలను కన్నట్టు ఉంది. వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది.

మహర్షిగా మారిన వాల్మీకి దండకార్యణం గుండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడని చెబుతారు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశాడని అంటారు.

తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడట.

శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడని చెబుతారు పరిశోధకులు. వాల్మీకి జీవితం శ్రీలంకలోనే ముగిసింది…వాల్మీకి చరిత్ర.. *స్వస్తీ…

Related posts

Share via