July 1, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

తాడిపత్రి : మహిళలు అయి ఉండి బట్టల షాపుకు వచ్చి ఇదేం పని.. సీసీలో రికార్డయిన బాగోతం

తాడిపత్రిలో లేడీ కిలాడీలు రెచ్చిపోయారు. ఓ షాపులోకి వెళ్లి కస్టమర్లలా నటిస్తూ చోరీకి పాల్పడ్డారు. సీసీ ఫుటేజ్ చూసి అవాక్కైన యజమాని.. పోలీసులను ఆశ్రయించాడు. చీరలు కొంటున్నట్లు బిల్డప్ ఇచ్చి.. చప్పుడు కాకుండా వాటిని ఎత్తుకెళ్లిన మహిళల ఆట కట్టించారు పోలీసులు.

ప్రస్తుతం సమాజం మోసాల మయం అయిపోయింది. ఎవర్నీ నమ్మే పరిస్థితి లేదు. అయ్యో అని జాలి పడి సాయం చేయబోతే.. ఉన్నదంతా ఊడ్చుకునే వెళ్లిపోయే ముఠాలు పెరిగిపోయాయి. మనం ఇప్పుడు అడవిలో ఉన్నట్లు భావించాలి. ఎవరు.. ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలీదు. అందుకే ప్రతిక్షణం అలెర్ట్‌గా ఉండాలి. ఇక దొంగతనాలు ట్రెండ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు రాత్రళ్లు దొంగలు పడి దోచుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పట్టపగలే కానిచ్చేస్తున్నారు. సెకన్ల వ్యవధిలో మాయం చేసి సొత్తు చోరీ చేస్తున్నారు. మహిళా దొంగలు సైతం రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో కిలాడీ లేడీలు చేతివాటం ప్రదర్శించారు

ఓ షాపులోకి వెళ్లి కస్టమర్లలా నటిస్తూ.. తమదైన స్టైల్లో చీరల్ని కాజేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా వారి బాగోతం బయటపడంతో.. పోలీసులు అదుపులోకి తీసకున్నారు. తాడిలోని జయనగర్‌ కాలనీలో చీరల దుకాణం ఉంది. కోమలి కిశోర్‌కుమార్‌రెడ్డి నిర్వహిస్తున్న ఆ దుకాణానికి శనివారం సాయంత్రం.. చీరల కొనేందుకు ఐదుగురు మహిళలు వచ్చారు. వారిలో ఓ ఇద్దరు.. అతన్ని మాటల్లో పెట్టారు.. మరో ముగ్గురు 12 చీరలను తీసుకుని.. క్షణాల వ్యవధిలో దాచేశారు. ఆ తర్వాత తమకు సరుకు నచ్చలేదంటూ బయటకు వచ్చి.. ఏం తెలియనట్లు అక్కడి నుంచి జారుకున్నారు.

షాపు ఓనర్‌కు వారు ప్రవర్తన మీద అనుమానం కలిగింది. సీసీ ఫుటేజ్ చూడగా చీరలు చోరీ జరిగినట్లు స్పష్టమైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.  సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. చీరలను చోరీ చేసిన మహిళలు కర్నూలు నగరానికి చెందిన సరోజమ్మ, రంగమ్మ, అరుణజ్యోతి, విజయలక్ష్మీ, సుజాతగా గుర్తించారు. వారిని ఆదివారం అరెస్టు చేసి, చీరలు రికవరీ చేశారు. ఈ చీరల విలువ సుమారు రూ.60వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. గతంలో కూడా బట్టల దుకాణాల్లో చీరల్ని కొంతమంది మహిళలు ఎత్తుకెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి. షాపుల యజమానులు ఇలాంటివారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also read

Related posts

Share via