వారిద్దరూ దగ్గర బంధువులు. అంతకుమించి స్నేహితులు..! ఊరు కాని ఊరుకి వచ్చాడన్న ఆనందంతో ఇద్దరూ కలిశారు. నదిలో స్నానం చేయాలనుకుని సరదాగా వెళ్లారు. అంతలోనే అదుపు తప్పి ఒకరు నీటి మునిగిపోయాడు. అక్కడ మునిగిపోతున్న ఒకడిని రక్షించడానికి ప్రయత్నించి మరొకడు కూడా జల సమాధి అయ్యారు. విశాఖలో జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది
విశాఖ జిల్లా గాజువాకకు చెందిన బంగారి జగన్ (18) ఇంటర్ చదివాడు. వారం రోజుల కిందట అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని దిమిలిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్ళాడు. దిమిలికి చెందిన శ్రీను (18) ఐటీఐ పూర్తి చేసి అప్రంటీస్ చేస్తున్నాడు. ఎలమంచిలి తెరువుపల్లి సమీపంలో మైనర్ శారదా నదికి శ్రీను, బంగారి జగన్ వెళ్లారు. అక్కడ స్నానానికి దిగారు. స్నానం చేస్తుండగా.. ప్రమాదశాత్తు గోతిలో పడి శ్రీను మునిగిపోయాడు. అతనిని రక్షించడానికి జగన్ ప్రయత్నించాడు. ఈ సమయంలో అతను జగన్ కూడా గోతిలో జారిపడిపోయాడు.
వీరిని గుర్తించిన స్థానికులు..నదిలో మునిగిపోతున్న ఇద్దరినీ రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే శ్రీను ప్రాణాల కోల్పోగా, కొన ఊపిరితో ఉన్న జగన్ ను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జగన్ మృతి చెందాడు. ఇద్దరు యువకులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో దిమిలి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.