ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి హృదయ విదారకర దృశ్యం కనిపించింది.
ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు. కానీ గిరిపుత్రుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. దీంతో గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. కనీసం రోడ్డు సౌకర్యం లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇది అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల వ్యధను చూపిస్తున్న దృశ్యం. ఏజెన్సీలో గిరిజనుల దైన్యానికి మరో నిదర్శనం ఇది. అభివృద్ధి మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ కనీస సౌకర్యాలకు నోచుకోక ఆదివాసీ పల్లెలు చస్తూ బతుకీడుస్తున్నాయి. అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయంటారు అధికారులు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్దామంటే దారి ఉండదు. అనంతగిరి మండలం కర్రీగూడ గ్రామానికి చెందిన బోయిన సన్యాసమ్మ తీవ్ర అస్వస్థకు గురైతే… డోలి కట్టి 8 కిలో మీటర్లు మోసుకెళ్లారు బంధువులు. అక్కడి నుంచి ఆటోలో ఆస్పత్రికి తరలించారు.
ఎవరికి ఏ ఆపద వచ్చిన ఇదే పరిస్థితి. వైద్యం అవసరమైతే డోలి కట్టి 8 నుంచి 10 కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిందే. దశాబ్దాలు గడిచినా ఆదివాసీలకు డోలీ కష్టాలు తప్పడంలేదు. ఆసుపత్రికి తరలించేలోపే ఎందరో డోలీలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కష్టాలు తీర్చాలని మొరపెట్టుకుంటున్నారు ఇక్కడి గిరిజనులు. ఎన్నికల్లో రోడ్లు వేస్తామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా గెలిచిన తరువాత పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పిస్తామని చెప్పి ప్రతిసారి తమను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి సౌకర్యం కల్పించి డోలీ మోతలు తప్పించాలని గిరిజనులు కోరుతున్నారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025