April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Lok Sabha 2024

ఈవీఎంలోని ఓట్లను ఎలా లెక్కిస్తారో తెలుసా.. పూర్తి కౌంటింగ్ ప్రక్రియ ఇదే..

ఏపీలో మరికొద్ది గంటల్లో కౌంటింగ్‌ ప్రక్రియకు తెర లేవనుంది. అసలు ఈ కౌంటింగ్‌ ప్రక్రియ ఎలా జరుగుతుందో, దాని కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. పోలింగ్‌ ముగిశాక ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్స్‌లో భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా అక్కడే నిర్వహిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా టేబుల్స్‌ ఏర్పాటుచేస్తారు. ఈ టేబుల్స్‌ 14 ఉంటాయి. ఒక్కో టేబుల్‌ మీద ఒక్కో ఈవీఎం ఉంచి ఓట్లను లెక్కిస్తారు. అలా 14 ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెల్లడించే ఫలితాన్ని ఒక రౌండ్‌ రిజల్ట్‌ అంటారు. ఆయా నియోజకవర్గాల్లో నమోదైన ఓట్ల సంఖ్యను బట్టి రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఓట్ల లెక్కింపుకు ముందు ఈవీఎంలను ఓపెన్‌ చేస్తారు. ఈవీఎం యంత్రంలోని రిజల్ట్‌ విభాగానికి ఒక సీల్‌ ఉంటుంది. ముందు దాన్ని తొలగిస్తారు. ఈవీఎం బయట కప్పును మాత్రమే ఓపెన్‌ చేస్తారు. లోపలి భాగాన్ని తెరవరు. ఆ తర్వాత ఈవీఎం పవర్‌ ఆన్ చేస్తారు. దానికి లోపల మరో సీల్‌ ఉంటుంది. దాన్ని తొలగిస్తే రిజల్ట్స్ బటన్‌ కనిపిస్తుంది. దాన్ని నొక్కితే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ఈ వివరాలను అధికారులు జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.

అయితే కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. వీటికోసం కౌంటింగ్‌ కేంద్రంలో ప్రత్యేక టేబుల్‌ ఏర్పాటు చేస్తారు. పోస్టల్‌ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఫలితాన్ని ప్రకటించేవరకు బాధ్యత మొత్తం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పైనే ఉంటుంది. ఇక ఈవీఎంలను ఓపెన్‌ చేస్తున్నప్పుడు, దాని సీల్‌ సరిగా ఉందా లేదా అనేది అన్ని పార్టీల ఏజెంట్లకు చూపిస్తారు. అది సరిగా ఉందని వాళ్లు నిర్ధారించుకున్న తర్వాతే ఈవీఎంలను ఓపెన్‌ చేసి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలు మొరాయించినట్లయితే, వీవీ ప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్‌లోని స్లిప్పులు లెక్క పెట్టాంటే దాదాపు గంట పడుతుంది.

ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఏపీ సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనా. రాష్ట్రంలో 1985 సున్నిత ప్రాంతాలు గుర్తించడంతో పాటు 12 వేల మందిని బైండోవర్ చేశామన్నారు. ఇక కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు ఏపీ సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అవుతుందన్నారు. 8గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్‌… 8.30కి EVMలలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు మీనా. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ లేనిచోట ఉదయం 8 గంటలకే ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలౌతుందని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ సెంటర్ల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశామన్నారు సీఈవో.

Also read

Related posts

Share via