April 17, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: బరా బరా పాకుకుంటూ వచ్చి ద్రావకాన్ని చిమ్మింది.. అది ఏంటా అని చూడగా.. వామ్మో..



పెరట్లో ఆడుకుంటున్నారు పిల్లలు… ఈ లోపల చెట్ల పొదల్లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏంటా అని చూస్తున్నారు పిల్లలు. సెకన్ల వ్యవధిలోనే అది వారి ముందకు వచ్చి.. విషం చిమ్మింది. దీంతో కంగుతిన్న పిల్లలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే పాము చిన్నారుల వెంటే ఇంట్లోకి వచ్చింది. దీంతో ఆందోళన చెందిన పెద్దలు యాక్షన్‌లోకి దిగారు…..


పెరట్లో ఆడుకుంటున్న చిన్నారులపై విషం కక్కుతూ వెంబడించి స్థానికులను సైతం ముప్పుతిప్పలు పెట్టిందో ప్రమాదకర విషసర్పం. విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజాం ఆదర్శనగర్‌లో వెంకట్ అనే వ్యాపారి తన కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. వెంకట్ తన ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని మొక్కలు పెంచుతున్నాడు. అయితే సాయంత్రం ఏడు గంటల సమయంలో స్కూల్ నుండి వచ్చిన తమ పిల్లలు పెరట్లో ఆడుకుంటున్నారు. అంతా సరదా సరదాగా ఆడుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఓ పాము వారి పైకి దూసుకు వచ్చింది. పెద్ద పెద్దగా బుసలు కొడుతూ విషయాన్ని కక్కుతూ వారికి కనిపించింది. ఆ పామును చూసిన వారికి ఏం చేయాలో తెలియక భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు. అయితే పాము కూడా వారిని వదలకుండా చిన్నారుల వెంటపడి ఇంట్లోకి చొరబడింది. భయంతో ఇంట్లోకి వచ్చిన తమ పిల్లల్ని చూసిన వెంకట్, అతని భార్య ఒకింత ఆందోళనకు లోనయ్యారు. ఇంతలో పాము వారిపైకి దూసుకురాటం గమనించి ఇంట్లో నుండి పిల్లలను తీసుకొని భయంతో బయటకు పరుగులు తీశారు. అనంతరం పెద్ద పెద్దగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.


వెంకట్ స్థానికుల సహకారంతో కర్రలు తీసుకొని ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికి పాము బుసలు కొడుతూ విషాన్ని కక్కుతూ ఇల్లంతా కలియ తిరుగుతుంది. ఆ పామును చూసిన స్థానికులు సైతం దగ్గరికి వెళ్లడానికి భయపడ్డారు. అలా సుమారు రెండు గంటలు వెంకట్‌తో పాటు స్థానికులను పాము ముప్పుతిప్పలు పెట్టింది. అయితే ఎట్టకేలకు ధైర్యం చేసుకుని పామును కొట్టి చంపారు స్థానికులు. ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్థానికుల దాడిలో చనిపోయిన పాము రక్తపింజరి అని తెలుసుకున్నారు వెంకట్ కుటుంబసభ్యులు. రక్తపింజరి అతి ప్రమాదకరమైన విషసర్పం. ఈ పాము కరిస్తే ఎవరైనా అక్కడికక్కడే చనిపోవాల్సిందే. ఈ పాము అధిక సమయం విషం చిమ్ముతూనే ఉంటుంది. పాము కరవకపోయినా పాము చిమ్మిన విషం మనిషి పై పడ్డా స్వేదరంద్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి మనిషి చనిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతటి ప్రమాదకరమైన రక్తపింజరి తమ ఇంట్లోకి ప్రవేశించడంపై ఆందోళన చెందుతున్నారు వెంకట్ కుటుంబ సభ్యులు.

Also read

Related posts

Share via