వీకెండ్, సరదాగా బీచ్‌కి వెళ్దాం అనుకునే వారికి ఇది షేకింగ్ న్యూస్. మీ వీకెండ్ ప్లాన్స్ మార్చుకోండి. లేదా.. బీచ్‌లో ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి. బీచ్‌లో నీళ్లున్నాయి.. అలలను చూసి ముచ్చటపడి ముందుకెళ్తామంటే సముద్రంతో అంత ఈజీ కాదు. బాపట్ల దగ్గర్లో ఉన్న రామాపురం బీచ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అలలు పర్యాటకులను మింగేస్తున్నాయి. ఇక్కడ ప్రతీ వీకెండ్ ఓ విషాదఘటన వెలుగు చూస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు రామాపురం బీచ్‌కు ఏమైంది?
Also read :ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..
హైదరాబాద్ నుంచి అతి దగ్గరలో ఉన్న బీచ్. చీరాల దగ్గర్లోని రామాపురం బీచ్. ఇక్కడ కారు ఎక్కితే ఆరు గంటల్లోనే రామాపురం బీచ్‌కు చేరుకుంటాం. నల్గొండ, నరసరావుపేట, చీరాల రూట్‌లో చేరుకుంటే సాయంత్రం హాయిగా బీచ్‌ను ఎంజాయ్ చేసి.. తిరిగి ఆరుగంటల్లో ఇంటికి తిరిగివచ్చేయొచ్చు. వీకెండ్ అయితే దగ్గర్లోనే విడిది ఏర్పాటు చేసుకుని సన్‌రైజ్‌ని కూడా ఎంజాయ్ చేస్తారు పర్యాటకులు. కాని… ఈ రామాపురం బీచ్ ఇప్పుడు డెత్‌బీచ్‌గా మారిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే 9మంది సముద్ర అలలకు కొట్టుకుపోయారు. ఈ మరణాల వెనుక అనేక కారణాలున్నాయి.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఉన్న రామాపురం బీచ్ ఇది. విహారయాత్రలకు వచ్చే విద్యార్ధుల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది. ఈనెల 21న ఏలూరుజిల్లాకు చెందిన 11 మంది విద్యార్ధులు రామాపురం బీచ్‌లో విహారయాత్రకు వచ్చారు. వీరంతా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్ళారు. స్థానికేతరులు కావడంతో ఎంత లోతులో ఈతకు వెళ్ళాల్లో తెలియక సముద్రంలో కొంతదూరం వెళ్ళారు. పెద్ద అలలు రావడంతో 11 మంది విద్యార్దుల్లో నలుగురు గల్లంతయ్యారు. వారంతా 20నుంచి 22ఏళ్ల మధ్య ఉన్నవారే. నితిన్, అమలరాజు, తేజ, కిషోర్ గా గుర్తించారు. కొద్ది సేపటికి వీరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అలాగే 23వ తేది ఆదివారం మరో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మంగళగిరి నుంచి బీచ్‌కు వచ్చిన 12 మంది యువకులు బాలనాగేశ్వరరావు, బాలసాయిగా గుర్తించారు. సముద్రపు అలల్లో చిక్కుకుని చనిపోయారు వీరంతా. ఇక్కడే కాదు చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఈనెల 9వ తేదిన విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సెలవు దినం కావడంతో కావూరివారిపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సరదాగా స్నేహితులతో సముద్ర స్నానాలకు వచ్చారు. అలల తక్కిడికి కాటి జైపాల్ అనే ఇంటర్ విద్యార్థి.. గల్లంతయ్యాడు. యువకుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తుండగానే.. మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఈనెల 15న ఇదే బీచ్‌లో నూజివీడుకు చెందిన బీటెక్ విద్యార్థులు 11 మంది ఈతకు వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా కోసూరి కార్తీక్, మైలవరపు కేదారేశ్వరరావు అనే విద్యార్దులు గల్లంతయ్యారు. వారిలో కేదారేశ్వర్రావు బయటపడ్డాడు కాని.. కార్తీక్ మృతదేహం లభించలేదు. ఈనెల 12న తాడేపల్లిగూడెంకు చెందిన కనగళ్ల గౌరీష్ అనే యువకుడు గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి గౌరీష్ మృతదేహం ఒడ్డుకు చేరుకుంది.
Also read :మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..
రామాపురం బీచ్ ఇప్పుడు యమపురంగా మారింది. ఇక్కడ ప్రతీ వీకెండ్ కనీసం ఒకరైనా మరణిస్తున్నారు. కొన్నిసార్లు మృతదేహాలు ఒడ్డుకి కొట్టుకొస్తుండగా.. ఇంకొన్ని సార్లు అవికూడా దక్కడంలేదు. నిజానికి బాపట్ల, చీరాల, వేటపాలానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే బీచ్ రామాపురంబీచ్. చూడముచ్చటగా ఉంటుంది. వీకెండ్‌లో హ్యాంగౌట్ స్పాట్. రెండేళ్లుగా రామాపురం బీచ్‌కు పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండడంతో రిసార్టులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రూములు ఆన్‌లైన్లో బుక్ చేసుకోవాలి. నెలరోజుల ముందే ఇక్కడి రిసార్టులు సోల్డ్ ఔట్. రేట్లు కూడా దండుకుంటారు. ప్రతీ సర్వీసూ కాస్ట్‌లీనే. అంత డిమాండుంది ఇప్పుడీ బీచ్‌కు. చుట్టుపక్కల జిల్లాల వారేకాదు.. రాష్ట్రాలవారూ వస్తుంటారు. హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు వీకెండ్ ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఈ బీచ్‌లో ప్రేమజంటలు ప్రతీ గడికి కనిపిస్తుంటాయి. ఈ జంటలతోనే ఆ రిసార్టులు నిండిపోతున్నాయంటే ఒక్కసారి రామాపురం క్రేజ్‌ని అర్ధం చేసుకోవచ్చు. కొన్ని రిసార్ట్‌లలో రాత్రి వేళల్లో లైటింగ్‌లు, డిజెలు, క్యాంప్‌ఫైర్లు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారు. విహారయాత్రకు వచ్చి సముద్రంలో మునిగిచనిపోతుంటే బాధగా ఉందంటున్నారు స్థానిక మత్స్యకారులు. ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా మద్యం తాగి సముద్రంలో మునగడానికి వస్తున్నారని చెబుతున్నారు.
Also read :NTR District: ఆ ఊర్లో 9వ తరగతి అమ్మాయి.. ఈ ఊర్లో 9వ తరగతి అమ్మాయి మిస్సింగ్.. కట్ చేస్తే..
రామాపురం బీచ్‌లలో వరుస మరణాల ఘటనలు చోటుచేసుకున్నా, యంత్రాంగం మాత్రం మేల్కొనడం లేదు. బీచ్‌లో తాకిడి పెరుగుతుండడంతో సిబ్బందిని పెంచే ప్రయత్నాలు లేవు. బయట నుంచి కొత్తగా వచ్చే వారికి సరైన అవగాహన కల్పించే విధంగా తీరం వద్ద ఏర్పాట్లు లేవు. ప్రస్తుతం పోలీసులు, మెరైన్ సిబ్బంది పర్యవేక్షణ ఆదివారం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ప్రైవేటు రిసార్టులు వ్యాపారానికే ప్రాధాన్యం ఇస్తున్నాకానీ, తమ దగ్గర బసచేసిన పర్యాటకుల రక్షణను విస్మరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గజ ఈతగాళ్లను పెంచాల్సిన అవసంర కూడా ఉంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఇటు పోలీసులు, అటు అధికారులు మేల్కొని మరణాలు అరికట్టే చర్యలు చేపట్టాలంటున్నారు పర్యాటకులు. బీచ్‌లో రక్షణ చర్యలు ఉండేలా పర్యాటక శాఖతో పాటు పోలీసులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం అయితే బీచ్‌ను క్లోజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు చేశాకే తిరిగి ప్రారంభిస్తామంటున్నారు పోలీసులు.
Also read :పెళ్లై, పిల్లులున్న 40 ఏళ్ల వ్యక్తితో.. 19 ఏళ్ల యువతి ప్రేమ.. చివరకు