November 21, 2024
SGSTV NEWS
CrimeNational

కూంబింగ్ చేస్తుండగా కలవరం..! భారీగా పేలుడు పదార్థాలు గుర్తింపు..

అల్లూరి జిల్లాలో భద్రతా బలగాలు ఏజెన్సీని జల్లెడ పడుతున్నాయి. ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతుండడం.. మరోవైపు మావోయిస్టు టీం సభ్యులు సంచరిస్తున్నారన్న సమాచారంతో నిఘా పెంచారు పోలీసులు. ఏఓబిలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే.. అడవిలో కూంబింగ్ చేస్తున్న బలగాలకు.. భారీ మావోయిస్టు డంప్ కనిపించింది. జీకే వీధి అటవీ ప్రాంతంలో భారీ మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పనసల బంధ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా బయటపడింది ఈ భారీ డంప్. ఈ డంపులో స్టీల్ క్యారేజ్ మందు పాతరలు 6, డైరెక్షనల్ మైన్స్ 2, ఎలక్ట్రికల్ వైరు 150మీటర్లు, మేకులు 5 కిలోలు, విప్లవ సాహిత్యం ఉన్నాయి.

ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు సంచరిస్తున్నారని ఇటీవల పోలీసుల ప్రకటిస్తూ పోస్టర్లు కూడా వేశారు. ఈ క్రమంలో డంప్ బయటపడటం తీవ్ర కలకలం రేపుతుంది. మావోయిస్టు డంపు పట్టుబడిన తర్వాత అల్లూరి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అల్లూరి ఏజెన్సీలో కూడా మావోయిస్టులపై ఆదరణ తగ్గిందని.. మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు ఎస్పీ తుహిన్ సిన్హా. మావోయిస్టు డంపు ఆ ప్రాంతంలో ఉండడానికి.. దాని వెనుక ఎవరు సహకారం అందించాలని లోతుగా విచారిస్తున్నామని అన్నారు ఎస్పీ తుహిన్ సిన్హా. ఎస్పీ తుహిన్ సిన్హాతో పాటు చింతపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డంపు రికవరీ చేసిన ఎస్సై జి.మాడుగుల, ఏ.శ్రీనివాసరావు, సీలేరు ఎస్సై రామకృష్ణ, ఆర్ఎస్ఐ జాన్ రోహిత్‎లకు జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రం, నగదు రివార్డులను అందజేశారు

Also read

Related posts

Share via