తెల్లవారేసరికి ఇంటి గోడలకు పెద్ద పెద్ద మేకులు… గోడలకే కాదు పచ్చని చెట్లకు కూడా చీలలు.. ఎవరూ కొడుతున్నారో తెలియదు… ఎప్పుడు కొడుతున్నారో అస్సలు అంతుచిక్కడం లేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న భయంతో అక్కడివారు రోజులు గడుపుతున్నారు. రాత్రి మాములుగానే ఉంటుంది.. కానీ తెల్లారేసరికిఇంటి ముందు గోడకి చీలలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో క్షుద్ర పూజల భయంతో ఆ గ్రామ ప్రజలు వణికిపోతున్నారు.
పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం చినతురకపాలెం వాసులకు రాత్రుల్లో నిద్ర లేదు. కంటి మీదు కునుకు లేకుండా కాపలా కాయడమే వీరి వంతైంది. గత పది, పదిహేను రోజులుగా వంతులు వారీగా డ్యూటీలు వేసుకొని అర్ధరాత్రుల్లో కాపలాలు కాస్తున్నారు. పదిహేను రోజుల క్రితం ఒకరి ఇంటి ముందు గోడకి చీల వెలసింది. ఆ తర్వాత రోజు పచ్చని చెట్టుకి మేకులు కనిపించాయి. అప్పటి నుండి ప్రతి రోజూ ఈ తంతు నడుస్తుంది. మొదట్లో ఆకతాయిల పనిగా కొట్టి పారేసిన స్థానికులు ఆ తర్వాత నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఆనవాళ్లు కూడా కనిపించడంతో భయంతో వణికి పోవడం మొదలు పెట్టారు. చేతబడి చేస్తున్నారన్న నమ్మకం ప్రబలిపోయింది. దీంతో ప్రతి రోజూ తెల్లవారగానే తమ గోడలను చెక్ చేసుకోవడం… స్థానిక మత పెద్దలను పిలిచి ప్రత్యేక పూజలు చేయించి వాటిని తీసివేయడం జరుగుతోంది.
Also read :రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
గత ఐదు రోజులుగా అర్ధరాత్రుల్లో కాపలా కాయడం మొదలు పెట్టారు. మేకులు కొట్టిన చెట్లను నరికి వేస్తున్నారు. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో స్థానికంగా మరింతగా భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఎవరికి చెప్పాలో తెలియక తమకి తామే భద్రత కల్పించుకునేందుకు స్థానికులు సిద్దమయ్యారు. రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం స్పందించి స్థానికుల్లో అవగాహన కల్పించడంతో పాటు చీలలు, మేకులు కొడుతున్న వారిని గుర్తించి అరెస్ట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.
Also read :Jagannath Mandir: ఈ ఆలయ క్షేత్ర పాలకుడు హనుమంతుడు.. ఎప్పుడూ గొలుసులతో బందీ.. పురాణ కథ ఏమిటంటే