July 5, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

హృదయవిదారక ఘటన.. ఛీ..ఛీ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..

ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట పురుగుల మందు డబ్బా పట్టుకుని తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ వృద్ద దంపతుల కష్టం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. కనిపెంచిన కొడుకే ఇంటి నుంచి గెంటేయడంతో దిక్కుతోచని స్థితిలో ఒంగోలు కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమంలో కొడుకు, కోడలిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిందేనంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు. ప్రకాశంజిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కిల్లే పెద్ద ఫకీరయ్య, సుబ్బమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆస్థిపంపకాల విషయంలో తేడాలు వచ్చి పెద్ద కొడుకు దూరంగా ఉంటున్నాడు. ఆర్మీలో పనిచేస్తున్న చిన్నకొడుకుతో కలిసి తన సొంత ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఆర్మీనుంచి రిటైర్‌ అయి ఇంటికొచ్చిన చిన్నకొడుకు కాశీశ్వరుడు తన భార్య విజయలక్ష్మి ఇద్దరూ నిత్యం తల్లిదండ్రులను కొడుతూ ఉండేవాళ్లు.

ఈ మధ్యే ఇంటి నుంచి గెంటేశారని పెద్ద ఫకీరయ్య ఒంగోలు కలెక్టరేట్‌లో జరుగుతున్న మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. తమను ఇంటి నుంచి గెంటేస్తే బయట గుడారం వేసుకుని ఉంటున్నామని వాపోయారు. తన స్వార్జితమైన ఇంటి నుంచి గెంటేయడమే కాకుండా కనీసం మంచినీళ్లు పట్టుకునేందుకు కూడా ఇంటి ఆరుబయటకు రానివ్వడం లేదన్నారు. తమను చంపేస్తారన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని తమ ఆవేదన చెప్పుకున్నారు వృద్ద దంపతులు. మీ కోసం కార్యక్రమంలో అర్జీ ఇచ్చి తమకు న్యాయం చేయకపోతే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాల్సిందేనంటూ తమ గోడును వెళ్లగక్కారు. వెంటనే స్పందించిన అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్మీలో పనిచేసినంత కాలం బాగానే ఉన్న తన చిన్నకొడుకు ఆర్మీలో రిటైర్ అయి తిరిగి వచ్చిన తరువాత ఇలా రాక్షసంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. తమకు న్యాయం చేయాలని పెద్ద ఫకీరయ్య దంపతులు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు

Related posts

Share via