April 6, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

పల్నాడు: గాలివానకు ఆ ప్రాంతం నుంచి ఎగిరిపోయిన తాటిమట్టలు.. బయటపడ్డ షాకింగ్ నిజం..



రెండు రోజుల క్రితం గాలి వాన వచ్చింది. అదే సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల సమీపంలోని వ్యవసాయ భూమిలో కుప్పగా వేసిన తాటాకులు గాలికి ఒక్కొక్కటి ఎగిరిపోయాయి… అయితే తాటాకులు ఎగిరి పోవడంతో వాటి కింద ఉన్న శవం బయటపడింది. శవం ఉందన్న వార్త దావానలంలాగా ఊరంతా వ్యాపించింది. మృతుడు గ్రామానికే చెందిన వృద్దుడు హరిశ్చంద్రగా గుర్తించారు. అంతేకాదు చంపిది ఎవరో కూడా అప్పటికే ఊరంతా ప్రచారం జరిగిపోయింది.


మాచర్ల మండలం పశువేముల సమీపంలో 65 ఏళ్ళ వృద్దుడ్ని చంపాల్సిన అవసరం ఎవరికి, ఎందుకు వచ్చిందో పోలీసులకు మొదట అర్ధం కాలేదు. ఆ తర్వాత వారి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ఒక మహిళ పగతో ఆ వృద్దుడ్ని చంపింది అని తెలుసుకుని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. గత ఏడాది డిసెంబర్‌లో బెజవాడ బ్రహ్మం, అతని మామ హరిశ్చంద్ర మధ్య వివాదం రాజుకుంది. వివాదం నేపధ్యంలోనే ఇరువురు గొడవపడ్డారు. ఇరువురు ఘర్షణ పడుతున్న సమయంలోనే బెజవాడ రమేష్ ఇద్దరిని వారించి అక్కడ నుండి పంపించి వేశాడు. ఆ కోపంతో హరిశ్చంద్ర.. రమేష్‌పై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో రమేష్ తలకు తీవ్ర గాయం కావడంతో అతను కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అపస్మారక స్థితిలో గుంటూరు జిజిహెచ్‌లోనే చికిత్స పొందుతున్నాడు.

రమేష్, అతని సోదరి మంగమ్మలపై హరిశ్చంద్ర దాడి చేసిన విషయం వారి తల్లి కోటమ్మకి తెలిసింది. తన కొడుకును కోమాలోకి పంపించిన హరిశ్చంద్రపై కోటమ్మ కక్ష కట్టింది. ఎట్లాగైనా సరై హరిశ్చంద్రపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అయితే గొడవ జరిగిన దగ్గర నుండి హరిశ్చంద్ర ఊరు వదిలిపెట్టి తెలంగాణాలోని హిల్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. దీంతో సరైన సమయం కోసం కోటమ్మ ఎదురు చూస్తుంది. ఇంతలోనే ఏప్రియల్ ఒకటో తేదిన ఫించన్ తీసుకునేందుకు హరిశ్ఛంద్ర వస్తాడన్న విషయం తెలుసుకున్న కోటమ్మ వారి బంధువులు నలుగురు ఉదయాన్నే హిల్ కాలనీకి వెళ్లారు. ఇంట్లో నుండి హరిశ్చంద్ర బయటకు రాగానే అతన్ని కిడ్నాప్ చేశారు. అక్కడ నుండి పశువేముల శివారులోకి తీసుకొచ్చారు. అక్కడ హరిశ్చంద్రను చంపేసి మృతదేహంపై తాటాకులు కప్పి వెళ్లిపోయారు. అయితే ఆ మరుసటి రోజే గాలివాన రావడం తాటాకులు ఎగిరిపోవడంతో హరిశ్చంద్ర హత్య బాహ్య ప్రపంచానికి తెలిసింది. కోటమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

తన కొడుకును కోమాలోకి పంపించిన హరిశ్చంద్రను హతమార్చి తన ప్రతీకారం తీర్చుకున్న కోటమ్మ గురించి గ్రామంలో కథలుకథలుగా చెప్పుకుంటున్నారు

Also read

Related posts

Share via