SGSTV NEWS
Andhra PradeshCrime

Tirupati: బాంబు బెదిరింపులతొ వణికిన తిరుపతి.. స్క్వాడ్ ముమ్మర తనిఖీలు



– బాంబు బెదిరింపులు బెంబేలెత్తిస్తున్నాయి…! పేల్చేస్తాం… చంపేస్తామంటూ వస్తున్న ఈ-మెయిల్స్‌ వణుకుపుట్టిస్తున్నాయి. తిరుపతితో పాటు తమిళనాడులోని ప్రముఖుల ఇళ్లకు బెదిరింపులు రావడంతో అలర్ట్‌ అయ్యారు రెండు రాష్ట్రాల అధికారులు. మరి ఆ కాల్స్‌ ఎక్కడ్నుంచి వచ్చాయ్…? ఎందుకొచ్చాయ్…? వివరాలు ఈ కథనంలో …


తిరుపతి ఒక్కసారిగా వణికింది. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ ఈ-మెయిల్స్ రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తిరుపతి బస్టాండ్‌, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలితీర్థం, గోవిందరాజులస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా అగ్రికల్చర్ కాలేజ్ హెలిప్యాడ్‌ దగ్గర కూడా సోదాలు చేశారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఆర్డీఎక్స్‌తో పేలుళ్లు చేయబోతున్నట్టు బెదిరింపులు రావడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. తమిళనాడు తిరువళ్లూర్‌ కేంద్రంగా ఐఎస్‌ఐ, మాజీ LTTE మిలిటెంట్లు కలిసి కుట్ర పన్నినట్టుగా మెయిల్‌ బెదిరింపులు వచ్చాయన్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.


తమిళనాడులోనూ మరోసారి బాంబు బెదిరింపుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్‌ నివాసం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి భవనం, సినీనటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సోదాలు నిర్వహించారు. బాంబు స్వ్కాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. అవి ఫేక్‌కాల్స్‌గా తేల్చినప్పటికీ.. కాల్స్ ఎక్కడ్నుంచి వచ్చాయ్‌…? ఎవ‌రు చేశార‌నే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రముఖుల ఇళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు

Also read

Related posts