ఒక వ్యక్తి బతికినంత కాలం ఎలా ఉన్నా.. అతను చనిపోయాడు అని తెలిస్తే మాత్రం పాపం అని అంటాం.. అతని గురించి కాసేపయిన కాస్త గౌరవంగా మాట్లాడుకుంటాం.. కుటుంబ సభ్యులు సైతం బతికినంత కాలం అతను ఎలా బతికినా.. కనీసం అంతిమ యాత్ర అయిన ఘనంగా చేయాలని భావిస్తారు. అందులో ఏ లోటు లేకుండా సంప్రదాయ బద్దంగా వీడ్కోలు పలుకుతారు. అయినవారంతా చివరి చూపు చూసుకుంటారు. కొందరయితే ప్రమాదంలో తమ వారు మృతి చెందితే చట్టప్రకారం.. మృతదేహానికి పోస్టు మార్టం చేయాల్సి ఉండగా డెడ్ బాడీ శరీర భాగాలు కట్ చేయటం ఇష్టం లేక పోస్టుమార్టం చేయడానికి అంగీకరించరు. కానీ కొందరు అధికారులకు, వైద్యులకు మాత్రం ఇవేవీ పట్టవు. మన సెంటిమెంట్ లతో వారికి పని ఉండదు.. అడుగడుగున నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ.. బాధితుల మనోభావాలతో ఆడుకుంటారు. అందుకు నిదర్శనమే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనితీరు. ఇక్కడి మార్చురి రూమ్ లో కనీస వసతులు లేవు.. పైగా ఇక్కడి అధికారుల నిర్లక్ష్యం పలువురికి శాపంగా మారింది.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామస్తులు శ్రీముఖలింగం దైవదర్శనానికి ఆటోలో వెళుతూ ఉండగా అచ్యుతాపురం వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గట్టెమ అచ్చెయ్యమ్మ(52), పద్మావతి(42) మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసన్న పేట CHC కి తరలించారు. అయితే అప్పటికే సాయంత్రం అయిపోవటంతో మరుసటి రోజు ఉదయం పోస్టుమార్టం చేసి పార్థివదేహాన్ని అందజేస్తామని అధికారులు కుటుంబసభ్యులకు చెప్పారు.
ఈ నేపథ్యంలో తన తల్లి అయిన అచ్చెయ్యమ్మను చూడడానికి వచ్చిన ఆమె కుమారుడు తల్లి మృతదేహం మార్చురీలో చీకటి గదిలో ఉండడం చూసి చలించిపోయాడు. ఆ పరిసర ప్రాంతాలలో పందికొక్కులు తిరుగుతుండంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉన్నామా.. నా తల్లిని చీకటి గదిలో పెట్టారు. పందికొక్కులు తిరుగుతున్నవి, హాస్పిటల్ చుట్టూ అపరిశుభ్రతంగా ఉంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తన తల్లిని భద్రం చేసుకోవడానికి ఫ్రీజర్ ను సైతం తెచ్చానని కానీ హాస్పిటల్ సిబ్బంది తాళాలు తెరవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ హస్పిటల్ పరిసర ప్రాంతాలను చూపించి రోదించాడు
ఈ సంఘటన అక్కడ ఉన్న వారిని తీవ్ర అవేదనకు గురిచేసింది. చనిపోయిన తన తల్లి దీనస్థితిని చూసి ఆ కుమారుడు ఆవేదన అక్కడ ఉన్న వారిని కూడా కంటతడి పెట్టించింది. అటు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అంతంత మాత్రమే ఉంటుందని.. ఇప్పుడు చనిపోయిన వారి పరిస్థితి కూడా అలాగే ఉందని తెల్లవారేసరికి తన తల్లి శరీర భాగాలను పందికొక్కులు కొరుకు తింటాయని ఆవేదన వ్యక్తం చేశాడు కుమారుడు.. ఇకనైనా అధికారులు స్పందించి.. చర్యలు తీసుకోవాలని కోరాడు.. తన తల్లికి జరిగిన విధంగా మరెవరికి జరగకూడదని రోదించాడు.
Also Read
- Andhra: రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ ఇదే..
- Telangana: 21 ఏళ్ల నిహారిక ఇంట్లో ఒంటరిగా ఉంది.. దూరపు బంధువునని లోపలికి వచ్చాడు.. ఆపై
- Andhra: సీబీఐ నుంచంటూ రిటైర్డ్ ఉద్యోగికి వీడియో కాల్.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది..
- Andhra: ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 32 మందికి పైమాటే.. ఏం చెత్త పనిరా దరిద్రుడా?
- Andhra News: కాకి పెట్టిన మంట..! కాలి బూడిదైన నాలుగిళ్లు.. అసలు మ్యాటర్ తెలిస్తే..





