SGSTV NEWS
Andhra PradeshCrime

అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేస్తే.. ఇంత దారుణమా.. తల్లిని చంపి ఈడ్చి పడేసిన కొడుకు!


అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కాలయముడై తల్లిని కడతేర్చాడు. సినిమాల మీద వ్యామోహంతో ఉద్యోగం రాలేదు. మానసిక ఒత్తిడితో ఆ కోపాన్ని తల్లిపై చూపించి యముడు అయ్యాడు. హైదరాబాద్ నుంచి వచ్చి ఉదయాన్నే తల్లిని చంపి హాలులోకి ఈడ్చుకుని వచ్చి తన కసాయితనాన్ని బయట పెట్టాడు ఆ కొడుకు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న ఈ సంఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది.

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్ వీధిలో కన్న తల్లిని అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు కుమారుడు. ఉప్పలపాటి లక్ష్మీదేవి ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డి నగర్ లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తోంది. భర్త విజయభాస్కర్ రెడ్డి బ్రాందీ షాపులో పని చేసేవాడు. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్నాడు. వీరికి యస్వంత్ కుమార్ రెడ్డి ఒక్కడే సంతానం. మూడు సంవత్సరాల క్రితం బీటెక్ పూర్తి చేసి సినిమాలలో నటించాలనే కోరికతో హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కొంత కాలంగా యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని హైదరాబాద్ లోని ప్రయివేటు డాక్టరు వద్ద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఆదివారం (అక్టోబర్ 5) ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చిన యశ్వంత్ తండ్రి నిద్రపోతున్న రూముకు బయట నుంచి లాక్ చేశాడు. తల్లిని ఇంట్లోనే అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి ఇంట్లో నుండి లాగుతూ బయట వరండాలో పడుకోబెట్టాడు. ఇంట్లోని హాలులో కూర్చొని మొబైల్ ఫోన్‌లో శివుడి పాటలు వింటూ కూర్చున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భయంతో వణికిపోయారు కుటుంబసభ్యులు. పోలీసులకు విషయం తెలిసి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. యశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సినిమాలలో నటించాలనే కోరిక బలంగా ఉండటంతో తల్లిని తరుచూ డబ్బులు ఇవ్వమని వేధించేవాడని, ఈ క్రమంలోనే తల్లి యశ్వంత్‌ను మందలించేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కన్నతల్లి అని చూడకుండా అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికుంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

Also read

Related posts