April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

దుర్గగుడికి వెళ్లి వచ్చేసరికి ఊహించని షాక్.. కారులో పెట్టిన నగలు మాయం..

భక్తుల రద్దీతో పాటు నిత్యం అమ్మవారి నామస్మరణతో మార్మోగే ఇంద్రకీలాద్రిపై పట్టపగలు జరిగిన ఘరానా చోరీతో భక్తులు ఉలిక్కిపడ్డారు. వాహనాల రాకపోకలు, భక్తుల తాకిడి ఉండే దుర్గ గుడిపై చోరీ ఎలా జరిగింది. కొండపై నిఘా కొరవడిందా..? లేకపోతే భక్తుల నిర్లక్ష్యమా అన్న చర్చ మొదలైంది. కారులో పెట్టిన బంగారం దర్శనం చేసుకొచ్చేలోపు మాయం కావటంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరైంది.


పెళ్లికి వెళ్తూ దుర్గమ్మని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికొచ్చిన కుటుంబం ఊహించని ఘటనతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆ కుటుంబం న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అమ్మవారి దర్శనం కాస్త ఆలస్యమైంది. బయటికొచ్చి కారు తీసి చూస్తే లోపల బంగారు నగల బ్యాగ్‌ మాయమైంది. దీంతో ఒక్కసారిగా షాక్‌ తింది బాధిత కుటుంబం. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దుర్గారావు కుటుంబ సభ్యులతో అమలాపురంలో బంధువుల పెళ్లికి వెళ్తూ మధ్యలో దుర్గమ్మ దర్శనానికి ఆగినప్పుడు జరిగిందీ ఘటన. కొండపై ఘాట్ రోడ్డు ఓం టర్నింగ్ సమీపంలో కారును పార్క్ చేసి దర్శనానికి వెళ్లారు. అమ్మవారికి నివేదన సమర్పించే సమయం కావడంతో క్యూలైన్లో రెండు గంటలపాటు ఉన్న దుర్గారావు కుటుంబ సభ్యులు దర్శనం తర్వాత తిరిగొచ్చి చూస్తే కారులో 270 గ్రాముల బంగారమున్న బ్యాగ్‌ కనిపించలేదు.


వేసిన తాళాలు వేసినట్లు ఉన్నాయి. పార్క్ చేసిన కారు అక్కడే ఉంది. కానీ కారులో ఉంచిన నగలు చోరీ కావడంతో బాధిత కుటుంబం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. నిత్యం భక్తుల రద్దీతో ఉండే కొండపై పార్కింగ్ పాయింట్ పట్టపగలు లక్షల విలువైన బంగారు నగలున్న బ్యాగ్ చోరీ కావడం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. మారుతాళాలతో కారు డోర్ తీసి బ్యాగ్‌ చోరీ చేసి ఉంటారని బాధిత కుటుంబం అనుమానిస్తోంది.

చోరీ అయిన బంగారు ఆభరణాల విలువ 20 లక్షల రూపాయలపైన ఉంటుందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుర్గారావు భార్య కారులో ఆభరణాలు పెట్టి వచ్చారు. ఆ సమయంలో కారు డోర్‌ రిమోట్ లాక్ కాకపోవడంతో చోరీ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అద్దాలు పగలకొట్టకుండా చోరీ జరగటంతో.. ఫింగర్ ప్రింట్స్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. పాత నేరస్తులు ఎవరైనా దోపిడీకి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

దొంగతనం జరిగిన తీరు ఆశ్చర్యంగా ఉందంటున్నారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్ తీసినా పాత నేరస్థుల ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని, తాళం సరిగా పడకపోవడంతో నేరం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరోవైపు కొండపై చోరీ సీసీ కెమెరాలలో ఎక్కడా రికార్డ్ కాలేదు. ఎక్కడైతే చోరీ జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు లేవు. ఇదే అదనుగా బంగారం బ్యాగ్‌తో ఉడాయించి ఉంటారని అనుమానిస్తున్నారు.

220కి పైగా కెమెరాలతో దుర్గమ్మ గుడిలో పకడ్బందీ నిఘా ఉందని చెబుతున్నా, చోరీ జరిగిన చోట మాత్రం సీసీ కెమెరాలు లేవు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు పార్కింగ్ కార్లలో దొంగతనాలు చేసే వారి గురించి ఆరా తీస్తున్నారు. చోరీ సమయంలో కార్ పార్కింగ్ ప్రాంతాల్లో కదలికలపై ఎంక్వయిరీ చేస్తున్నారు

Also read

Related posts

Share via