SGSTV NEWS
Crime

Andhra Pradesh: ఒకవైపు మెడికల్ టెస్టులు.. మరోవైపు గ్రామస్థుల పూజలు.. తురకపాలెం మరణాల మిస్టరీ వీడెదెన్నడూ..



తురకపాలెం మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు.. ఆరోగ్య శాఖ అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటే.. గ్రామస్థులు మాత్రం తమ నమ్మకాల మేరకు బొడ్రాయి చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా మరణాలపై ఇంకా స్పష్టత రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

గత 5 నెలల్లో 30 మంది మరణించిన ఘటనతో వార్తల్లో నిలిచిన తురకపాలెం గ్రామంలో మరణాల మిస్టరీ ఇంకా వీడలేదు. ఆరోగ్య శాఖ అధికారుల బృందం ఒకవైపు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే.. మరోవైపు గ్రామస్థులు తమ నమ్మకాల మేరకు బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ రెండు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మరణాలకు గల అసలు కారణంపై ఇంకా స్పష్టత రాలేదు.

వైద్యుల పరిశోధనలు
గ్రామంలో మెలియాయిడోసిస్ అనే వ్యాధి ప్రబలిందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. జాతీయ, రాష్ట్ర స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు పైబడిన అందరి హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేశారు. 2,517 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 1,343 మంది ఆరోగ్య పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో 1,026 మందిలో కిడ్నీల పనితీరు మందగించినట్లు, 168 మందికి కాలేయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు అధిక సంఖ్యలో ప్రజలు బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ అనారోగ్య సమస్యలే మెలియాయిడోసిస్ వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.

స్థానికుల విశ్వాసాలు, పూజలు
వైద్య శాఖ పరిశోధనలు ఒకవైపు జరుగుతుండగా.. గ్రామస్థులు తమ నమ్మకాలను అనుసరించి బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని బొడ్డురాయితో పాటు ఉన్న గవిటి రాయి వంగిపోవడంతోనే వ్యాధులు ప్రబలి జనం చనిపోతున్నారని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో అమ్మోరు వాక్కు ప్రకారం, గత సోమవారం బొడ్రాయిని సరిచేసి, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 108 బిందెలతో నీళ్లు పోసి ప్రత్యేక పూజలు చేశారు. అదే రోజున వచ్చిన మరో వాక్కు ప్రకారం, ఇటీవల పొంగళ్లు పెట్టి 501 బిందెలతో కుల మతాలకు అతీతంగా బొడ్రాయికి మరోసారి నీళ్లు పోశారు.


తాగునీరు, ఆహారం సరఫరా
గ్రామంలో తాగునీరు కలుషితమైందన్న వార్తల నేపథ్యంలో గత వారం రోజులుగా అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. శుక్రవారం నుండి తిరిగి సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే గత ఐదు రోజులుగా బయట నుండి ఆహారాన్ని అందిస్తున్న అధికారులు నేటి నుండి దానిని నిలిపివేశారు. మొత్తానికి తురకపాలెం మరణాలపై ఇంకా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు వైద్య పరిశోధనలు, మరోవైపు సంప్రదాయ నమ్మకాలు – ఏది నిజమో తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే

Also read

Related posts

Share this