ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ తరహా దోపిడీల కలకలం మొదలైంది. నల్లజర్ల, తణుకులో సంపన్న కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ నేరాలకు పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
ఒకప్పుడు చెడ్డీ, రాజస్థాన్ గ్యాంగులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను బెంబేలెత్తించాయి. ఆ ముఠాల పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేవి. కరుడు గట్టిన నేరస్థులు సినీ ఫక్కీలో..రాత్రి వేళ తలుపులు పగులగొట్టి.. ఇళ్లలో నిద్రిస్తున్న వారిపై దాడులకు తెగబడి ఉన్నదంతా దోచుకెళ్లేవారు. తాజాగా ఈ తరహా నేరాలు పురివిప్పుతున్నాయి. వారం రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని నల్లజర్ల, నాలుగు రోజుల కిందట తణుకులో దోపిడీకి పాల్పడ్డ నిందితులను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించడంతో అంతా అప్రమత్తం అయ్యారు .
10 రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో దోపిడీలకు పాల్పడిన ఈ ముఠాలు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించినట్లు సమాచారం రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. లాడ్జిలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జాతీయ రహదారుల కూడళ్లలోనూ నిఘా పెట్టారు. ఇప్పటికే కొన్ని పోలీసు స్టేషన్లకు, సోషల్ మీడియాలోనూ దొంగల ఫొటోలను పంపారు. వీరిని పట్టిస్తే రూ.50 వేలు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
వీరు తొలుత రెక్కీ చేసి దొంగతనాలు చేస్తారు. ఈ ముఠా సభ్యులు ఎక్కువగా జాతీయ రహదారులు, రైలు పట్టాలు ఆనుకొని ఉండే గ్రామాల సమీపంలో మాటు వేస్తారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడతారు. తొలుత ఓ చోట స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. కార్లలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణిస్తుంటారు. ఎంచుకున్న గ్రామాల్లో ఒకట్రెండు రోజులు రెక్కీ నిర్వహిస్తారు. ఒంటరిగా నివసిస్తున్న, అనువైన ఇళ్లను ఎంచుకుంటారు. నల్లజర్ల, తణుకులో జరిగిన దోపిడీలను పరిశీలిస్తే ఈ రెండు ఇళ్లూ సంపన్న కుటుంబాలకు చెందిన వారివే. అయితే అక్కడ ఒంటరి మహిళలే నివాసం ఉంటున్నారు. ఈ ముఠా ముందుగా పసిగట్టే ఈ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!