రాజకీయాలు అంటేనే ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ప్రత్యర్థులను అడ్డు తొలగించుకునేందుకు అనేక మార్గాలు కూడా అన్వేషిస్తుంటారు. కానీ ఆ జిల్లాలో ఓ ఎమ్మెల్యేపై ఏకంగా క్షుద్ర పూజలు చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అది కూడా ఓ మహిళా ఎమ్మెల్యే పై చేతబడి చేశారని తెలియడంతో.. ఇప్పుడు ఈ పొలిటికల్ చేతబడి హాట్ టాపిక్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యే టార్గెట్గా జరిగిన ఈ తాంత్రిక క్రియల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు?? ఇది ప్రత్యర్థుల పనా??? లేక సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యే ఎదుగుదల గిట్టని వారి కుట్రనా??? అనంతపురం జిల్లా పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్న ఈ వింత ఉదంతంపై పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పాలిటిక్స్ ఇప్పుడు నిమ్మకాయలు, పసుపు, కుంకుమల చుట్టూ తిరుగుతోంది. నగరంలోని అరవింద్ నగర్‌లో గల సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజల కలకలం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్షుద్ర పూజలు వెనుక ఏదో పెద్ద కుట్రే ఉందని ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుమానిస్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే చేతబడి.. క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణి మండిపడుతున్నారు. యువ మహిళా ఎమ్మెల్యే.. చురుగ్గా నియోజకవర్గంలో దూసుకుపోతుంటే… ఆమెకు అడ్డుకట్ట వేసేందుకు… దూకుడుకు కళ్ళెం వేసేందుకు బ్లాక్ మ్యాజిక్ పాలిటిక్స్ ప్రయోగించారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి ప్రత్యర్ధుల నుంచి కంటే.. సొంత పార్టీలోని గ్రూపు రాజకీయాలే పెద్ద తలనొప్పిగా మారాయి. ఎమ్మెల్యే అవ్వకముందు నుంచి బండారు శ్రావణికి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు నుంచి వ్యతిరేకవర్గం బలంగా ఉంది. తనను మానసికంగా దెబ్బతీసేందుకే ఎవరు ఈ క్షుద్ర పూజల డ్రామా ఆడుతున్నారా అన్న అనుమానం కూడా ఎమ్మెల్యేలో ఉంది.. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బండారు శ్రావణి తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు తరచూ వస్తున్నాయని.. అదే విధంగా రెండు నెలలుగా తనకు కూడా ఆరోగ్యం బాగుండటం లేదని ఎమ్మెల్యే బండారు శ్రావణి చెప్పడం గమనార్హం.
ఈనెల 6వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో షిఫ్ట్ కార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే బండారి శ్రావణి ఇంటిముందు నిమ్మకాయలు… పసుపు, కుంకుమ…. తెల్ల రాగులు, నువ్వులు విసిరేసి పారిపోయారని ఎమ్మెల్యే బండారు శ్రావణి చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ సిసి ఫుటేజ్‌ను కూడా బయటపెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చిన కారు నెంబర్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరికి వచ్చిన కారు గుంటూరుకు చెందిన వాణిజ్య పన్నుల శాఖలో ఏఓగా పని చేస్తున్న ఆదిలక్ష్మి పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే ఆ కారు తాను అమ్మేసినట్లు కారు ఓనర్ ఆదిలక్ష్మి పోలీసులకు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ కారు ఎవరు కొనుగోలు చేశారు… అసలు ఆరోజు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు క్షుద్ర పూజలు చేసిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్ల రాగులు, నువ్వులు ఇంటి ముందు పడేసి వెళ్లిన వ్యక్తులు ఎవరు అన్నది సస్పెన్స్ గా ఉంది. ప్రత్యర్ధుల కంటే… సొంత పార్టీ నాయకుల వైపే ఈ క్షుద్ర పూజల అంశం వేలెత్తి చూపుతోంది.
మొత్తానికి ఇంత టెక్నాలజీ పెరిగాక ఇంకా ఈ క్షుద్ర పూజల రాజకీయం ఏంటని జిల్లాలో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మంత్ర, తంత్రాల రాజకీయ సెగలు సింగనమల రాజకీయాన్ని ఎటు తీసుకెళ్తాయో చూడాలి.
Also Read
- ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఉరి
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య - మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
- బీభత్సం సృష్టించిన అంబులెన్స్.. మహిళ మృతి
- అయ్యో దేవుడా? ఇంకా ఎన్నాళ్లీ మరణమృదంగం..!సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
- బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి కుటుంబసభ్యులు ఏమి చేశారంటే?





