బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు… చదువు పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఆశించాల్సిన వారు… విలాసాలకు బానిసై బుల్లెట్ బైక్‌ల చోరీలకు పాల్పడ్డారు. యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనాల ట్రిక్స్ నేర్చుకొని… ఏకంగా 25 లక్షల విలువైన 16 బుల్లెట్‌లు, ఒక స్కూటీని అపహరించారు. చివరకు అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు.
వాళ్లంతా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్ధులు. బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నారు. ఒకే ఒక సంవత్సరం.. చదువు పూర్తి చేస్తే ఇంజనీరింగ్ పట్టా చేతికొచ్చేది. ఆ తరువాత ఎంచక్కా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసుకునేవారు… అయితే చక్కగా చదుకుని ఇంజనీర్లు కావాల్సిన ఆ బీటెక్ విద్యార్ధులు విలాసాలకు అలవాటు పడి దొంగల అవతారమెత్తారు… ఒంగోలు సమీపంలోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఏడుగురు బిటెక్ ఫైనలియర్ విద్యార్ధులు ఓ ముఠాగా ఏర్పడి బుల్లెట్ బైక్‌లను చోరీలు చేయడం ప్రారంభించారు… అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 లక్షల విలువైన 16 బుల్లెట్ బైక్‌లను చాకచక్యంగా అపహరించారు.. అంతా బాగా జరుగుతోందనుకుంటున్న సమయంలో వీరి బండారం బయటపడింది… బాపట్ల జిల్లా అద్దంకి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. నిందితులైన బిటెక్ స్టూడెంట్స్ నుంచి 25 లక్షల విలువైన 16 బుల్లెట్ బైక్‌లు, ఓ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు.
చిక్కింది ఇలా…
బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరకొండ తిరునాళ్లకు వచ్చిన ఓ వ్యక్తి తన బుల్లెట్ వాహానాన్ని హైవే రోడ్ మార్జిన్‌లో పార్క్ చేసి తిరునాళ్లకు వెళ్లాడు… ఆ తరువాత వచ్చి చూసుకుంటే బండి కనిపించలేదు… ఆ తరువాత అద్దంకి పట్టణంలో చిన్నగానుగపాలెం, కాకానిపాలెం, దామావారిపాలెం, సింగరకొండ గుడి, ఓల్డ్ ఆంధ్ర బ్యాంక్ దగ్గర వివిధ ప్రాంతాలలో బుల్లెట్ వాహనాలు వరుస చోరీలకు గురయ్యాయి… దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఒకే తరహాలో బుల్లెట్ బైక్‌లు మాయం అవుతున్నాయని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు… బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈ బుల్లెట్ బైక్‌ల చోరీలను సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. చీరాల డిఎస్సీ ఎండి మొయిన్ ఆధ్వర్యంలో అద్దంకి పోలీసులు రంగంలోకి దిగారు… సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని బైక్‌లను చోరీలు చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు… అద్దంకి పోలీసు స్టేషన్ పరిధిలో 9 బుల్లెట్ బైక్‌లు, జే.పంగులూరు పోలీసు స్టేషన్ పరిధిలో 1 బుల్లెట్, 1 స్కూటీ, చిలకలూరిపేట పోలీసు స్టేషన్ పరిధిలో 3 బుల్లెట్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు… అలాగే నరసరావు పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో 1 బుల్లెట్, మద్దిపాడు పోలీసు స్టేషన్ పరిధిలో 1 బుల్లెట్, మేదరమెట్ల పోలీసు స్టేషన్ పరిధి లో 1 బుల్లెట్… ఇలా మొత్తం 16 బుల్లెట్ బుల్లెట్ బైక్‌లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు…
చోరీలు చేసిన బుల్లెట్ బైక్‌లలో కొన్నింటిని దర్జాగా వాడుకుంటూ మిగిలిన వాటిని అమ్ముకునేందుకు అద్దంకి సమీపంలోని బ్రహ్మానంద కాలనీలోని పాడు బడిన బిల్డింగ్ దగ్గర దాచిపెట్టారు… మంగళవారం అద్దంకి వచ్చి చోరీ చేసిన బుల్లెట్ బండ్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఏడుగురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. వీరంతా ఒంగోలు, కందుకూరులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధులుగా గుర్తించారు.
యూట్యూబ్ ద్వారా చోరీలు ఎలా చేయాలో నేర్చుకున్న విద్యార్ధులు…
చోరీలకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధులు ఒంగోలు విఐపి రోడ్‌లో, హిందూ శ్మశాన వాటిక దగ్గర్లో రూములు తీసుకుని ఉంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా సులువుగా డబ్బులు సంపాదించే మార్గం కోసం అన్వేషించారు. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి బుల్లెట్ బండ్లు దొంగతనం చేసే విధానాన్ని చూశారు. బైక్‌పై కూర్చొని ఒక కాలుతో హ్యాండిల్‌ను గట్టిగా తంతే హాండిల్ లాక్ బ్రేక్ అయ్యిపొతుందని తెలుసుకున్నారు… హ్యాండిల్ కింద ఉన్న వైర్లు కట్ చేసి కలిపితే బండి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది అని వీడియో చూసి ఒక ట్రయల్ వేశారు… అది సక్సెస్ కావడంతో వరుసగా బైక్‌లను చోరీ చేయడం ప్రారంభించారు… ఇక కొద్ది రోజుల్లోనే ఇంజనీరింగ్ పట్టాలు అందుకోవాల్సిన వారు చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ కేసులను చేధించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చీరాల డిఎస్పీ, అద్దంకి సీఐలను బాపట్లజిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025