March 12, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Andhra Pradesh Assembly : ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్‌



ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వైఎస్ జగన్‌కు ప్రతిపక్ష హోదా అంశంపై కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని స్పీకర్ తెలిపారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తమన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.



ఏపీ అసెంబ్లీలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కీలక రూలింగ్‌ ఇచ్చారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్‌ తనకు లేఖ రాశారన్నారు.‌  ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు చెవాకులు పేలారు. స్పీకర్‌కి హైకోర్టు సమన్లు ఇచ్చినట్టుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.  స్పీకర్‌కి దురుద్దేశాలను ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌ను క్షమిస్తున్నా. ఇక ముందు కూడా జగన్‌ ఇలాగే వ్యవహరిస్తే ఏం చేయాలో సభకే వదిలిపెడుతున్నానని అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

10శాతం సీట్లు రాకుండా గతంలో ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గత చరిత్రను కూడా స్పీకర్‌ గుర్తు చేసారు. కనీసం 18 సీట్లు రాకుండా ప్రతిపక్ష హోదా రాదని.. ఇది జగన్‌కు కూడా తెలుసని చెప్పారు స్పీకర్. గతంలోనూ ఎవరికీ ఇవ్వలేదని తెలిసి కూడా జగన్ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

ప్రతిపక్ష హోదాపై జగన్‌ హైకోర్టుకు కూడా వెళ్లారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా.. వద్దా అనే దశలోనే ఉంది. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామకున్నా. కానీ కొన్ని రోజులుగా జగన్‌‌ సహా వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇస్తున్నానని అన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు.. ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలి. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారు? ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైసీపీ సభ్యులను కోరారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

Also read

Related posts

Share via