SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: పోలీసుల కొంపముంచిన కోడికూర వ్యవహారం.. ఏం జరిగిందో తెలిస్తే..



ప్రకాశంజిల్లా సింగరాయకొండ ఎస్‌ఐ మహేంద్ర వ్యవహారశైలి ఆ శాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది. ఊళ్ళపాలెం గ్రామ శివారులో కోడి పందేల శిబిరంపై దాడి చేసి 46 వేల నగదు, రెండు కోళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయకుండా రమేష్ అనే యువకుడ్ని చితకబాదినట్టు ఆరోపణలు వచ్చాయి. ఘటనా స్థలంలో రెండు కోళ్ళు దొరికితే వాటిని వండుకుని తినేశారని, విషయం బయటకు పొక్కడంతో వేరే కోళ్ళను తీసుకొచ్చి పీఎస్‌లో ఉంచారన్న ప్రచారం ఉంది.

కోడి పందేల శిబిరంపై దాడి చేసి పట్టుకున్న కోళ్ళను పోలీసులు వండుకు తినేశారట. ప్రకాశంజిల్లాలో చోటు చేసుకున్న ఖాకీల నిర్వాకం ఇప్పుడు పోలీసుశాఖకు తలవంపులు తెచ్చిపెట్టింది. దాడిలో పట్టుకున్న నగదును, కోళ్ళను స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడ ఉన్న రమేష్‌ అనే యువకుడ్ని సింగరాయకొండ ఎస్‌ఐ మహేంద్ర లాఠీతో కుళ్ళబొడిచారంటూ గ్రామస్థులు రగిలిపోతున్నారు. తప్పు చేస్తే కేసులు పెట్టి కోర్టులో హాజరుపర్చాలేకానీ, యువకుడ్ని చావచితక్కొడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని పోలీసులను ప్రశ్నించిన టిడీపీ నేతలపై కూడా ఎస్‌ఐ మహేంద్ర తిట్ల పురాణం లంకించుకున్నారట. మంత్రి బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకెళ్ళిన టిడీపీ నేతలను ఆ కోళ్ళు మంత్రి దగ్గరే తీసుకోండంటూ ఎస్‌ఐ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని, అసలు మేము అధికార పార్టీలో ఉండాలా వద్దా అంటూ టిడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ళను వండుకుతిన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఉళ్ళపాలెంలో కోడిపందేల శిబిరం నడుస్తున్నట్టు సింగరాయకొండ పోలీసులకు సొమవారం రాత్రి సమాచారం అందింది. ఈ మేరకు సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు సింగరాయకొండ ఎస్‌ఐ మహేంద్ర. అయితే పోలీసులను చూసి పందెం ఆడుతున్న వారు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలంలో కొంత నగదు, రెండు కోళ్ళు దొరికాయట. వాటిని తీసుకుని వస్తుండగా దారిలో పక్క గ్రామం సోమరాజుపల్లికి చెందిన రమేష్‌ పోలీసులకు తారసపడ్డాడు. రమేష్‌ దగ్గర 16వేల రూపాయలు ఖరీదు చేసే కోడి ఉండటంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ గతంలో కోడి పందేలు ఆడిన విషయం గుర్తుంచుకున్న ఎస్‌ఐ మహేంద్ర అతడ్ని అదుపులోకి తీసుకుని అతడి దగ్గర ఉన్న కోడిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడే లాఠీ తీసుకుని రమేష్‌ను విచక్షణా రహితంగా చితకబాదినట్టు బాధితుడు రమేష్‌ చెబుతున్నాడు. రమేష్‌ ఒంటిపై వాతలు తేలిఉన్నాయి. రమేష్‌ను గతంలో కూడా ఇలాగే పోలీసులు కొట్టారని, ఇప్పుడు కూడా తన కొడుకు తప్పుచేస్తే కొట్టాలే కానీ ఈ విధంగా గొడ్డును బాదినట్టు బాదితే అతనికేమైనా జరిగితే ఎవరు బాధ్యతవహిస్తారని రమేష్‌ తల్లి పద్మ ఆక్రోశం వ్యక్తం చేశారు. తన కొడుకు తప్పు చేస్తే కోర్టులో హాజరుపర్చాలేకానీ, ఈ విధంగా నిర్దయగా, విచక్షణారహితంగా కొట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. చట్టాన్నిచేతుల్లో తీసుకుని తన కొడుకును ఇష్టం వచ్చినట్టు కొట్టిన పోలీసులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎస్‌ఐ చేతిలో దెబ్బలుతిన్న బాధితుడు రమేష్‌ తల్లి పద్మ చెబుతున్నారు.

టిడీపీ నేతలకు పరాభవం, మంత్రిని కూడా లేక్కచేయలేయని వైనం
మరోవైపు ఊళ్ళపాలెంలో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు అదే సమయంలో కోళ్ళను అమ్ముకునేందుకు వెళుతున్న సోమరాజుపల్లికి చెందిన వారిని కొట్టడాన్ని స్థానిక టిడీపీ నేతలు తప్పుపడుతున్నారు. పందేలతో సంబంధం లేని తమ గ్రామానికి చెందిన యువకుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న 16 వేల రూపాయల ధర పలికే పందెంకోళ్ళను తిరిగి ఇవ్వాలని ఎస్‌ఐ మహేంద్రను కోరితే తనపై బూతులతో విరుచుకుపడ్డారని సోమరాజుపల్లి తెలుగు యువత అధ్యక్షుడు బ్రహ్మయ్య యాదవ్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని నియోజకవర్గానికి చెందిన మంత్రి బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకెళ్ళామని, మంత్రి దృష్టికి తీసుకెళ్ళామన్న కోపంతో మంత్రికి చెబితే భయపడతానా అంటూ మంత్రికి కూడా ఎస్‌ఐ గౌరవం ఇవ్వలేదంటున్నారు. గతంలో కూడా ఎస్‌ఐ మహేంద్ర ఓ మహిళా టీచర్‌ను అసభ్యంగా దూషించారని, అలాగే చిరుదుకాణం నిర్వహించుకుంటున్న మహిళను కూడా ఇదే విధంగా బూతులతో తిట్టారని చెబుతున్నారు. ఇలా అయితే తాము అధికార పార్టీలో ఉండాలా రాజీనామా చేయాలో అర్దం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సోమరాజుపల్లి తెలుగు యువత అధ్యక్షుడు బ్రహ్మయ్య యాదవ్‌.

రాత్రి రైడింగ్‌లో పందెం కోళ్ళను పట్టుకుని కేసు నమోదు చేయకుండా ఉదయం వాటిని పోలీసులు వండుకుతిన్నారన్న సమాచారం బయటకు రావడంతో సింగరాయకొండ పోలీసులు నానా హైరానా పడుతున్నారట. రాజకీయ నేతల దగ్గరకు చేరి ఈ విషయంలో ఇరుక్కున్న పోలీసులను కాపాడుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. చేసిన తప్పునుంచి తప్పించుకునేందుకు ఓ రెండు కోళ్ళను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఉంచారట. ఇక ఎంత చేసినా ఏం లాభం పరువు పోయిన తరువాత అంటున్నారట ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.

Also read

Related posts

Share this