April 3, 2025
SGSTV NEWS
Andhra Pradesh

ఉదయాన్నే ఆలయానికి వెళ్లగా  చెల్లాచెదురుగా వస్తువులు.. సీసీ ఫుటేజ్ చూడగా షాక్



శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆలయంలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. రొళ్ల మండలం జీర్గేపల్లి గ్రామంలోని అమ్మవార్ల దేవాలయంలోకి అర్ధరాత్రి మూడు ఎలుగుబంట్లు ఎంటరయ్యాయి. వాటి విజువల్స్ ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గుడిలో భక్తులు లేని సమయంలో ఎలుగుబంట్లు రావడంతో ఎలాంటి హాని జరగలేదు.

ఈ మధ్య వన్యప్రాణులు ప్రముఖ ఆలయాల వద్ద హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద సంచరిస్తూ భక్తులను పరుగులు పెట్టిస్తున్నాయి. ఒక్కోసారి భక్తులపై దాడులకు పాల్పడుతున్నాయి. అడవుల్లో ఆహారం నీరు దొరక్క, జనావాసాల్లోకి వస్తున్న క్రమంలో రాత్రివేళ ఇళ్లల్లోకి, ఆలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి. తాజాగా సత్యసాయి జిల్లాలోని ఓ ఆలయంలో ఎలుగుబంట్లు చొరబడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.


శ్రీ సత్య సాయి జిల్లా రోళ్ళ మండలం జీర్గేపల్లి గ్రామంలోని స్వారక్క, గ్యారక్క, ముడుపక్క త్రిమూర్తి అమ్మవార్ల ఆలయం ఉంది. రోజూలాగే ఉదయం, సాయంత్రం ఆలయంలో నిత్యకైంకర్యాలు నిర్వహించి పూజారులు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో అర్ధరాత్రి ఈ ఆలయంలోకి మూడు ఎలుగుబంట్లు చొరబడ్డాయి. అయితే భక్తులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆహారం కోసం తరచూ రాత్రి సమయాల్లో ఆలయ ప్రాంగణంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు. అవి ఎక్కడ ఇళ్లలోకి చొరబడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను సమీప అటవీ ప్రాంతంలోకి తరలించాలని కోరుతున్నారు

Also read

Related posts

Share via