November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

బిడ్డకు జన్మనిచ్చి చెప్పాపెట్టకుండా పారిపోయిన తల్లి.. 5 నెలల తరువాత జరిగిందిదే..

గత ఏడాది అక్టోబర్ 21 జిజిహెచ్‎లోని గైనకాలజీ వార్డుకు నిండు నెలలతో కూడిన ఓ మహిళ చేరింది. ఆమె పేరు అలేఖ్య. ఆమెతో పాటు లక్ష్మీ అనే సహాయకురాలు వచ్చింది. చేరిన మరోసటి రోజే ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు బరువు తక్కువుగా ఉంది. దీంతో లక్ష్మీ ఆ శిశువును పిడీయాట్రిక్ వార్డుకు తీసుకొచ్చింది. చిన్న పిల్లల వైద్యులు శిశువు గురించి వివరించే లోపే అక్కడ నుండి లక్ష్మీ వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత లక్ష్మీ, అలేఖ్య ఇద్దరూ కలిసి జిజిహెచ్ నుండి వెళ్లిపోయారు. దీంతో శిశువు ఆలనా పాలనా జిజిహెచ్ సిబ్బందిపై పడింది.


పిడియాట్రిక్ వార్డులో ఉన్న శిశువును గత ఐదు నెలలుగా ఆసుపత్రి సిబ్బందే కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. బరువు తక్కువుగా పుట్టిన శిశువు ఇప్పుడు పూర్తిగా బరువు పెరిగి అందరి శిశువుల్లానే తయారైంది. అయితే ఆమె తల్లిని కనుగొనడం జిజిహెచ్ సిబ్బందికి గగనమై పోయింది. ఈ విషయాన్ని జిజిహెచ్ సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ కొత్తపేట పోలీసులకు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అలేఖ్యను గుర్తించే పనిలో పడ్డారు. కేవలం ఆమె ఆధార్ కార్డు ఆధారంగానే గుర్తించాల్సి రావడంతో పోలీసులు ఐదు నెలలుగా ఆమె అడ్రస్ కోసం గాలిస్తున్నారు. ఆధార్ అడ్రస్ ప్రకారం వెళ్లిన పోలీసులకు ఆమె అక్కడ కనిపించలేదు. దీంతో ఆమె ఎక్కదుందా అన్నదానిపై దర్యాప్తు కొనసాగించారు. అయితే అలేఖ్యను గుర్తించి జిజిహెచ్‎కు తీసుకురావడానికి ఐదు నెలల సమయం పట్టింది.

చిట్ట చివరగా నర్సరావుపేటలో అలేఖ్యను గుర్తించిన పోలీసులు జిజిహెచ్‎కు తీసుకొచ్చారు. ఐదు నెలల వయస్సులో ఆరోగ్యంగా ఉన్న శిశువు చూసి తల్లి తల్లడిల్లిపోయింది. తప్పు తెలుసుకొని శిశువును తీసుకెళ్లేందుకు సిద్దమైంది. శిశువు తక్కువ బరువు ఉండటంతో వైద్య ఖర్చులు పెట్టుకోలేక ఆసుపత్రిలో విడిచి పెట్టి వెళ్లినట్లు ఆమె చెప్పింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడిందని శిశువును తీసుకెళ్తానని చెప్పడంతో అటు పోలీసులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తూ శిశువును అప్పగించారు.

Also read

Related posts

Share via