November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Guntur: కార్పోరేషన్‌‌లో లేఖ మిస్సింగ్ కలకలం… ఇంతకీ ఆ లెటర్‌లో ఏముంది…

ఇంతకీ ఆ లేఖ ఎటు పోయింది. అధికారుల్లో టెన్షన్ మాములుగా లేదు. ఎవరో ఒకరిపై వేటు పక్కా అని వణికిపోతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో లేఖ మిస్సింగ్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి..


గుంటూరు కార్పోరేషన్‌లో ఒక లేఖ మిస్సింగ్ కలకలం రేపుతోంది. గత వారం రోజుల నుండి ఉద్యోగులందరూ ఆ లేఖ కోసమే వెతుకుతున్నారు. అయినా ఇప్పటి వరకూ దొరకలేదు. దీంతో కార్పోరేషన్ కమీషనర్ పులి శ్రీనివాస్ లేఖ మిస్సింగ్ పై విచారణకు ఆదేశించారు. త్వరలోనే నివేదిక ఇవ్వాలంటూ ఆర్డర్ వేశారు.


నగరంలోని భజరంగ్ జూట్ మిల్లుకు చెందిన స్థలంలో హైరైజ్ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతోంది. వైసిపి నేత అంబటి మురళి కృష్ణ యాజమాన్యంలోని కంపెనీ గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్స్ పేరుతో హైరైజ్ భవనాలను నిర్మాణం చేస్తుంది. అయితే జూట్ మిల్లు స్థలం పక్క నుంచే రైల్వే ట్రాక్ వెళ్తుంది. రైల్వే ట్రాక్ సమీపంలో ఏ నిర్మాణం చేపట్టాలన్న ఆ శాఖ నుండి NOC తీసుకోవాలి. గ్రీన్ గ్రేస్ యాజమాన్యం మొదట జి ప్లస్ 4 భవనం నిర్మించడానికి రైల్వే శాఖ నుండి అనుమతి తీసుకుంది. అయితే రైల్వే ట్రాక్ నుండి 75 అడుగులు వదిలి పెట్టి నిర్మాణాలు ప్రారంభించాలని NOCలో రైల్వే అధికారులు సూచించారు.

అయితే ప్రస్తుతం 15 అంతస్థుల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మాణాలను పరిశీలించిన రైల్వే అధికారులు గత ఏడాది మే నెలలో NOC రద్దు చేస్తున్నట్లు ఒక లేఖను గుంటూరు కార్పోరేషన్‌కు పంపించారు. కార్పోరేషన్ పరిధిలోనే నిర్మాణం జరుగుతుండటంతో రైల్వే అధికారులు ఆ లేఖను కార్పోరేషన్‌కు పంపించారు. అయితే NOC రద్దైన కార్పోరేషన్ అధికారులు నిర్మాణాలను నిలిపి వేయలేదు. ఇది ఇలా ఉండగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.


రైల్వే NOC రద్దైనా కార్పోరేషన్ అధికారులు నిర్మాణాలను అడ్డుకోకుండా తాత్సారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు పొన్నూరు టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర . దీంతో రంగంలోకి దిగిన కార్పోరేషన్ కమీషనర్ పులి శ్రీనివాస్ రైల్వే అధికారులు NOC రద్దు చేస్తూ పంపిన లేఖను తీసుకురావాలంటూ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అయితే కార్పోరేషన్‌కు చెందిన ఫైల్స్‌లో లేఖ కనిపించలేదు. మరొకవైపు అదే లేఖను ఎమ్మెల్యే దూళిపాళ్ళ నరేంద్ర మీడియాకు విడుదల చేశారు. దీంతో కార్పోరేషన్‌లోని సిబ్బందే కావాలని లేఖ మాయం చేసినట్లు ప్రచారం జరిగింది.

మరొకవైపు రైల్వే శాఖ నుండి తపాలా వచ్చినట్లు కార్పోరేషన్‌లో నమోదైంది. మరి లేఖ తీసుకున్నది ఎవరు.. మాయం చేసింది ఎవరు అన్న కోణంలో దర్యాప్తు చేసి పూర్తి స్తాయి నివేదిక ఇవ్వాలని కమీషనర్ పులి శ్రీనివాస్ ఆదేశించారు. దీంతో కార్పోరేషన్ సిబ్బందలో కలకలం రేగింది. ఎవరో ఒకరు సస్పెండ్ కావడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆ లేఖ ఆధారంగానే గ్రీన్ గ్రేస్ అపార్ట్ మెంట్‌లో నిర్మాణ పనులను కార్పోరేషన్ అధికారులు నిలిపివేశారు. అంతటి ప్రాధాన్యమున్న లేఖ కావటం అది కనిపించకపోవడం పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతోంది.

Also read

Related posts

Share via