SGSTV NEWS online
Andhra Pradesh

ఆ ఊర్లో బడికి వెళ్లాలంటేనే దడుసుకుంటున్న పిల్లలు.. ఎందుకో తెలుసా?



ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలే కాదు టీచర్లు కూడా గజగజలాడిపోతున్నారు. ఎటునుంచి ఏం జరుగుతుందో తెలియక నిత్యం భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నారు..

కర్నూలు జిల్లా నందవరం మండలం సోమలగూడూరు గ్రామంలోని పాఠశాలకు వెళ్లాలంటేనే పిల్లలు గజగజలాడిపోతున్నారు. టీచర్లు కొడతారనో, హోం వర్క్‌ చేయలేదనో కాదు. అద్వాన్నంగా ఉన్న పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరుకోవడమే ఇందుకు కారణం. గ్రామంలో ఉన్న మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఉండగా, ఇందులో సుమారు 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.


అయితే పాఠశాలలో మొత్తం ఐదు తరగతి గదులు ఉండగా, అందులో ఉన్న రెండు తరగతి గదులలో గత కొన్ని రోజులుగా పాఠశాల పైకప్పు భాగంలో ఉన్న పెచ్చులు ఊడి పడుతూ ఉన్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో పాఠశాలలోని రెండు తరగతి గదులకు తాళం వేసి, మిగిలిన మూడు గదులలో విద్యార్థులను కూర్చోపెట్టి, క్లాసులు నిర్వహిస్తున్నామని పాఠశాల హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో నాడు నేడు కింద పనులు చేపట్టాలపి సూచించినా.. ఇంతవరకు అధికారులు స్పందించలేదని, ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని హెడ్ మాస్టర్ సుబ్బారెడ్డి కోరారు.

Also read

Related posts