March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు



తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాల కోసం దిగారు యువకులు. ఈతరాకపోవడంతో ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురిని తిరుమలశెట్టి పవన్‌, పడాల దుర్గాప్రసాద్‌, అనిశెట్టి పవన్‌.. గర్రె ప్రకాష్‌, పడాల సాయిగా గుర్తించారు పోలీసులు.

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా సందడి నెలకొంది. హరహర మహాదేవ శంభో శంకర అని భక్తుల శివనామ స్మరణతో కిటకిటలాడుతున్నాయి శివాలయాలు. అయితే మహా పండుగ వేళ తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరిలో పుణ్య స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. గోదావరి నది లోతుగా ఉన్న ప్రదేశాన్ని గమనించని ఐదుగురు యువకులు నీటిలో స్నానానికి మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతయ్యారు. తోటి యువకుల అరుపులు విన్న స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో తిరుమల శెట్టి పవన్(17), పడాల సాయి కృష్ణ(19), పి. దుర్గాప్రసాద్‌ (19) మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎ. పవన్‌ (19), జి.ఆకాశ్‌ (19) ఆచూకీ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. యువకులంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. యువకులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ ప్రాంతమంతా కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. కాగా, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ దగ్గరుండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Also read

Related posts

Share via