April 19, 2025
SGSTV NEWS
Andhra Pradesh

Palnadu: ‘పొద్దంతా కూకోబెట్టి.. పని చెయ్యకుండా పంపుతారా..?’ తహసీల్దారును అడ్డగించిన రైతు



ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన రైతు కంచేటి చంద్రరావు శుక్రవారం తహసీల్దారు ఆఫీసు ముందు బైఠాయించి పొలంలో సాగు నీటి సదుపాయం ఉన్నట్లుగా బోరు ధ్రువపత్రం సాధించుకున్నాడు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి…

ఆయనొక రైతు… పేరు కంచేటి చంద్రరావు..ఊరు పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల… తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దీని కోసం తహశీల్ధారు సంతకం అవసరమవ్వడంతో ఆయన శుక్రవారం తహశీల్ధారు కార్యాలయానికి వచ్చాడు.

తన దరఖాస్తును తహశీల్దారు కార్యాలయంలో అందించాడు. దరఖాస్తును పరిశీలించిన తహశీల్ధారు నళిని.. వీఆర్వోను వెరిఫై చేయమని ముప్పాళ్లకు పంపించింది. దీంతో రైతు తహశీల్ధారు కార్యాలయంలోనే ఉండిపోయాడు. ముప్పాళ్ల వెళ్లిన విఆర్వో రైతు చంద్రరావు గురించి… ఎంక్వైరీ చేసి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్దం చేసి కార్యాలయంలో అందించాడు. ఇంకేంముంది తనకు అనుమతి లభిస్తుందని ఆశించిన రైతుకు అశాభంగం ఎదురైంది.

వీఆర్వో నివేదిక ఇచ్చేటప్పటికీ సమయం ఐదు గంటలైంది. దీంతో తహశీల్ధారు నళిని కార్యాలయం నుండి వెళ్లిపోయేందుకు కారు ఎక్కింది. దీంతో నిరాశ చెందిన రైతు కార్యాలయం గేటు వద్ద తహశీల్ధారు కారుకు అడ్డంగా కూర్చొన్నాడు. ఉదయం నుండి తహశీల్దారు సంతకం కోసం వేచి ఉంటే సంతకం పెట్టకుండా వెళ్లపోవడాన్ని ప్రశ్నించాడు. అయితే ఐదు గంటల తర్వాత తాను సంతకాలు చేయనని తహశీల్ధారు చెప్పడంతో రైతు ఆవేదన చెందాడు. దీంతో కారు ముందు కూర్చొని నిరసన తెలిపాడు. తన ఫైల్ మీద సంతకం చేసే వెళ్ళాలని పట్టుబట్టాడు.


దీంతో కంగుతిన్న రెవిన్యూ సిబ్బంది రైతుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రైతు నిరసన విరమించేందుకు నిరాకరించాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి చంద్రరావుకు సర్ధి చెప్పారు. నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమయం మించి పోయిన తర్వాత పట్టుబట్టకూడదని సూచించారు. అయినప్పటికీ రైతు పట్టు వీడకపోవడంతో.. చేసేది లేక అధికారులు..  చంద్రరావుకు ధ్రువపత్రం అందజేశారు. దీంతో ఆ రైతు శాంతించాడు.

Related posts

Share via