November 22, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

వరిపొట్టు, కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ.. అనుమానంతో చెక్ చేయగా..

తిరుపతి జిల్లాలో స్మగ్లర్ రూటే సపరేట్ అన్నట్లు స్మగ్లింగ్ కొనసాగుతోంది. పుష్ప సినిమా తలదన్నే రీతిలో స్మగ్లర్ల స్టైల్ మారింది. శ్రీకాళహస్తిలో ఇసుక అక్రమ తరలింపు బయటపడింది. టర్బో లారీల్లో ఇసుకను నింపి, దానిపైన వరిపొట్టుచల్లి రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్‎కు కూతవేటు దూరంలోనే ఇటుక బట్టిల్లో భారీగా ఇసుక డంప్ చేసి.. స్మగ్లింగ్ చేస్తున్నా పోలీసులు కనిపెట్టలేక పోయారు. అయితే తాజాగా ఈ అక్రమ ఇసుకపై దృష్టి పెట్టిన పోలీసు యంత్రాంగం ఎట్టకేలకు స్మగ్లర్ల ఆట కట్టించింది. పక్కా సమాచారంతో పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేశారు. లారీల్లో యథేచ్చగా ఇసుక నింపి.. పైన వరిపొట్టు కప్పుకుని టన్నుల కొద్ది ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ముఠా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.


ఇసుక తరలిస్తున్న రెండు లారీలు, జేసీబీ స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీం ఇసుక లారీలను 2 టౌన్ పోలీస్ స్టేషన్‎కి తరలించారు. లారీ, జేసీబీ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఏపీలో కొనుగోలు చేసిన లారీలతో చెన్నైకి ఇసుకను అక్రమంగా తరలించి వ్యాపారం చేస్తున్న తమిళనాడు వాసులు దినేష్, రాజేష్‎లపై కేసు నమోదు చేశారు. గత కొంత కాలంగా వేలాది టన్నుల ఇసుకను ఈ ఇసుక మాఫియా బహిరంగంగానే తరలిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం అక్రమ ఇసుక తరలింపుపై కఠిన ఆంక్షలు విధించటంతో మాఫియా పుష్ప సినిమా తరహాలో ఇసుక స్మగ్లింగ్ చేస్తూ వచ్చింది. లారీల్లో నిండుగా ఇసుక నింపి, దానిపైన వరి పొట్టు, కూరగాయలు, పూలు, క్వారీ దుమ్ము చల్లుకుని వ్యవసాయ ఉత్పత్తులు తరలిస్తున్నట్లు కొత్త డ్రామాకు తెర తీసింది. ఈ మేరకు దొంగ బిల్లులు తయారు చేసుకొని సరిహద్దులు దాటిస్తున్న కేటుగాళ్లు బండారం ఎట్టకేలకు బయటపడింది. అక్రమంగా ఇసుక తరలిస్తూ అడ్డంగా దొరికిపోవడంతో సినిమా సీన్స్ తలదన్నే వ్యవహారం మరోసారి బయటపడింది

Also read

Related posts

Share via