July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ఆ నిబంధనలను పట్టించుకోని ఆసుపత్రులు.. అధికారుల కఠిన చర్యలు

తల్లి లేదా బిడ్డ ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పుడే మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేయాలని నిబంధనలు కచ్చితంగా చెబుతున్నాయి. అయితే ప్రవేటు ఆసుపత్రుల్లో ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ అవసరానికి మించి సిజేరియన్ శస్త్ర చికిత్సలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం లెక్కలతో సహా నిబంధలను ఉల్లంఘిస్తున్న వారి ముందుంచి చర్యలకు సిద్దమైంది.

గుంటూరు నగరంలో ప్రవేటు రంగంలో ఆసుపత్రులు లెక్కకు మించి ఉన్నాయి. అదే విధంగా జిజిహెచ్ లాంటి పెద్ద ఆసుపత్రులు కూడా ఉన్నాయి. 2023-24లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 10,320 కాన్పులు జరగ్గా, ప్రవేటు ఆసుపత్రుల్లో 15,555 కాన్పులు జరిగాయి. వీటిల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,128 సిజేరియన్లు జరగ్గా ప్రవేటు హాస్పిటల్స్‎లో ఏకంగా 9,333 సిజేరియన్లు జరిగాయి. అయితే అవసరం లేకపోయినా ప్రవేటు ఆసుప్రతుల్లో శస్త్ర చికిత్సలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కో సిజేరియన్ ఆపరేషన్ కు రూ.70 వేల నుండి రూ.1.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నారని అనధికార లెక్కలు చెబుతున్నాయి. వైద్యం కోసం వచ్చిన వారి బలహీనతలను డబ్బులుగా మార్చుకుంటున్నారనే విమర్శల నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా వైద్య శాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలో వంద శాతం సిజేరియన్ ఆపరేషన్లు చేసిన ఆసుపత్రులను గుర్తించి జిల్లా వైద్య శాఖాధికారి విజయలక్ష్మీ నోటీసులు జారీ చేశారు. కాటూరి మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, నందనా హాస్పటల్, డివీసీ ఆసుపత్రి, వీ కార్డియాలజీ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రులకు ఇప్పటికే నోటీసులు అందాయి. నోటీసులు అందుకున్న ఆసుపత్రులు వెంటనే వివరణ ఇవ్వాలని డిఎంఅండ్‎హెచ్ వో నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా మరొక ఇరవై ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. దీంతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిబంధనలకు విరుద్దంగా ఆపరేషన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని వైద్య శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. మరొకవైపు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండటంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also read

Related posts

Share via