December 11, 2024
SGSTV NEWS
Andhra PradeshHealthSpiritual

AP News: అచ్చం గణపయ్య మాదిరిగా కొబ్బరి బోండం.. ఆశ్చర్యపోతున్న జనం

ఈ కొబ్బరికాయను చూశారా..? అచ్చం గణపతి ఆకారంలో ఉంది. దీంతో ఈ కాయను చూసేందుకు భక్త జనం తరలి వస్తున్నారు. ఈ కాయ కాసిన చెట్టుకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి….


“ఇందుకలడు అందు లేడను సందేహము వలదు… ఎందెందు వెతికినా అందందెకలడు దానవాగ్రణీ”. భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడని సంశయము ఉండనవసరం లేదు. ప్రతి వస్తువు లోనూ, జీవిలోనూ, పరమణావులోనూ ప్రతిచోటా ఆ అంతర్యామి ఉంటాడని భావం. పోతన ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యం భావం నేటికీ వాడుక భాషలో మనకు కనిపిస్తుంటుంది. ముఖ్యంగా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు ఇలాంటి వాటికి ఉపమానంగా ఈ పదాలను ప్రయోగిస్తుంటారు. అయితే చూసే దృష్టి, కొలిచే మనస్సు ఉండాలే కాని చరాచర జగతిలో భగవంతుడు ఎక్కడైనా కనిపిస్తుంటారు. మేఘాల మాటున కదులుతూ, చెట్టు మానుల్లో సజీవ రూపంలా, శిలలపైన ఆకృతిలో తరుచుగా భగవంతుడి చిత్రాన్ని మనం చూస్తూనే ఉంటాము. ఇటీవల చందమామలో సాయిబాబా కనపడ్డారంటూ పెద్ధ ఎత్తున ప్రజలు ఆకాశం వంక చూసి బాబా రూపాన్ని పున్నమి చుద్రుడిలోని ప్రతిబింబంలో చూసుకున్నారు. చందమామలో ఓ పెద్ద మర్రి చెట్టు దానికి కింద పేదరాశి పెద్దమ్మ ఉందంటూ ఇప్పటికీ కథలు చదువుతూనే ఉన్నాము.



కాని నిజంగా పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకులు ఇల్లెందుల పర్రులో ఆశ్చర్యకరంగా వినాయకుడు రూపం కొబ్బరి బోండం కనిపించింది. పసల భాస్కరరావు తన పొలంలోని కొబ్బరి చెట్ల నుండి కాయలు తీస్తుండగా ఒక చెట్టు నుండి తీసిన కొబ్బరికాయల్లో వినాయకుని ఆకారం పోలిన బొండాం కనిపించింది. ఆ లభించిన కొబ్బరికాయకు తొండం కలిగి పూర్తిగా గణనాధుని ఆకారం పోలి ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడు ఇటువంటి కాయలు చూడకపోవటంతో అందరూ ఆ కాయను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.

ఇంకా ఆ విఘ్ననాధుడు తమ పొలంలో దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, తమ పొలంలో ఈ కొబ్బరికాయ లభించిన చెట్టుకు చాలా ప్రత్యేకత ఉందని భాస్కర్ రావు టీవీ9 తెలుగుకు తెలిపారు. ఈ కొబ్బరి చెట్టు నుండి రాలిన కాయలు నుండి తయారైన కొబ్బరి మొక్కను గతంలో అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు 18 రోజులు దీక్ష ధారణ సమయంలో పూజలు నిర్వహించారని.. అనంతరం శబరిమలకు ఆ మొక్కను తీసుకుని వెళ్ళి కొండపై ఈ కొబ్బరి మొక్కను నాటినట్లు చెప్పారు. ఆ కొబ్బరి చెట్టుకే ఇప్పుడు… ఇలాంటి కాయ రావటంతో స్ధానికులు ఆ గణపతే గ్రామంలో వెలిశాడని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Also read

Related posts

Share via