November 21, 2024
SGSTV NEWS
Andhra Pradesh

Chandrababu: జగన్‌ తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది

జగన్‌ తిరుమలకు వెళ్లవద్దని ఎవరైనా నోటీసులు ఇచ్చారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉందని తెలిపారుబ. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు



అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ(శుక్రవారం) సీఎం చంద్రబాబు సచివాలయంలోని మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ… ఎవరైనా సరే తిరుమల సంప్రదాయాలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు చెప్పారు

హిందూ సంఘాల ఆందోళనలతో పోలీస్‌ యాక్ట్‌ పెట్టారని అన్నారు. సాకులు అడ్డు పెట్టుకుని జగన్‌ తిరుమలకు వెళ్లడం లేదని అన్నారు. తిరుమలకు వెళ్లవద్దని జగన్‌ను ఎవరూ ఆపలేదని చెప్పారు. తిరుమల హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రమని తెలిపారు. పుణ్య క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

గతంలో నియమాలు ఉల్లంఘించి జగన్‌ తిరుమలకు వెళ్లారని గుర్తుచేశారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయని అన్నారు. దేవుడి వద్దకు వెళ్లే ఎవరైనా ఆ ఆచారాలను పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ను తిరుమలకు వెళ్లవద్దని ఎవరూ చెప్పలేదన్నారు. ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పామని సీఎం చంద్రబాబు అన్నారు.

జగన్‌ తిరుమలకు వెళ్లవద్దని ఎవరైనా నోటీసులు ఇచ్చారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు యాక్ట్‌ 30 అమల్లో ఉందని తెలిపారు. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

తిరుమలలో నియమాలు, ఆచారాలు పాటించాలి

‘వేరే మతానికి చెందిన వారైతే సంప్రదాయాలను పాటించాలి. ర్యాలీలు వద్దని మాత్రమే చెప్పాం వెళ్లవద్దని చెప్పలేదు. తిరుమలలో జరిగిన అంశాల మూలంగా భక్తులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఎవరైనా నీకు నోటీసులు ఇచ్చారా ఇస్తే చూపండి. ప్రజా జీవితంలో ఉన్న మనం కొన్ని సంప్రదాయాలు పాటించాలి. దేవుని ఆచారాలు సంప్రదాయాలు కన్న వ్యక్తి గొప్పవారు కాదు. కలియుగ వైకుఠం తిరుమల హిందువులకు అతి పెద్ద పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడకు వెళ్లినప్పుడు నియమాలు, ఆచారాలను, ఆగమ శాస్త్రాలను పాటించాలి’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.



ఇప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమిస్తారా..

‘‘నేను తిరుమల వెళ్తాను.. ఇంతకు ముందు వెళ్లాను అంటే ఇప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమిస్తారా…? లా అబైడింగ్ సిటిజన్స్ ఎవరైనా గౌరవంగా సంతకం చేసి వెళ్తారు. మతాన్ని గౌరవించడం అంటే ఒక ఆలయంలో ఉన్న సంప్రదాయాన్ని గౌరవించడం. నువ్వు బైబిల్‌ను చదువుతున్న అంటున్నావ్.. ప్రజలు అందరూ ఆలోచించాలి. నేను హిందువుగా పూజ చేస్తా. ఇతర మతాలను సామరస్యంతో చూస్తా. బైబిల్‌ను నాలుగు గోడల మధ్య కాకుండా.. బయటకు వచ్చిచదువు. పాబ్లో ఎస్కోబార్ ఎలా ప్రవర్తించారో.. జగన్ ప్రవర్తన అలాగే ఉంది’’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు.

ఆలయాల ప్రక్షాళన..

‘‘ఎన్‌డీడీబీ రిపోర్టు వచ్చింది. అది మేము ఇచ్చింది కాదు. ఇది జరిగింది గనుక ఈ నెల 23న శాంతి హోమం చేశారు. టీటీడీ ఈవో చెప్పలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో నాసిరకం నెయ్యి వచ్చిందని చెప్పా. అప్పట్లో నియమాలు ఎందుకు మార్చారు. తిరుమలలో రూమ్‌లు, భోజనం, ప్రసాదాలు బాలేదని భక్తులు ఫిర్యాదులు, ఆందోళనలు చేయలేదా. ఇక్కడే కాదు ఏపీలోని అన్ని దేవాలయాల్లో ఇలా జరిగింది. రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలను ప్రక్షాళన మేము అధికారంలోకి వచ్చాక చేస్తున్నాం.

అనంతపూర్‌లో ఈశ్వర్ రెడ్డి నేనే రథాన్ని తగలబెట్టను అని చెబుతున్నారు. మీరు ఇలా చేస్తుంటే మేము సైలెంట్‌గా ఉండాలా. భక్తుల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు ఎవ్వరూ ఇచ్చారు. మీకు సంతకం పెట్టడం ఇష్టం లేదు..అందుకే వెళ్లలేదు. ఎవరి మతానికి చెందిన దేవాలయాల్లో ఆ మతం వారినే నియమిస్తామని చెబితే దానికి పెడర్థాలు తీసి దళితులను దేవలయాల్లోకి రానివ్వరా అని మాట్లాడుతున్నారు’’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.


మతసామరస్యాన్ని కాపాడాలి

‘‘పంది మాంసం, బంగారం, నెయ్యి రాగి అంటాడు దాన్ని కనీసం ఎందుకు ఖండించడం లేదు జగన్ సమాధానం చెప్పాలి. సెక్యులర్ దేశంలో మతసామరస్యాన్ని కాపాడాలి… తిరుమలలో డిక్లరేషన్ ఉంది దాన్ని పాటించాలి. గతంలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు చట్టవ్యతిరేక కార్యక్రమం చేసి డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు. దేవాలయంలో సంప్రదాయాలు పాటించాలి. వేంకటేశ్వర స్వామిని వ్యాపారం, పైరవీలు కోసం మీరు వాడుకున్నారు. లడ్డూకు వాడే నెయ్యిను మైసూర్‌, గుజరాత్‌కు టెస్టింగ్‌కు ఎందుకు పంపలేదు. గతంలో ఎందుకు పరిశీలించలేదో చెప్పాలి. మీరు బైబిల్ చదువు కుంటాను అన్నారు తిరుమలలో డిక్లరేషన్  ఇవ్వమని అడిగాం. తెలిసిన వారు ఎవ్వరూ వచ్చినా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చిన నోటీసును జగన్‌కు ఇచ్చినట్టు చెబుతున్నారు. వేంకటేశ్వరస్వామికి అపచారం చేసిన మాట్లాడకూడదా. ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది సమస్యగా మారింది. ఒక సెక్యులర్ దేశంలో ఇలాంటి సమస్య వచ్చింది. నువ్వు వేసిన ఈవో నిన్ను ఎలా డిక్లరేషన్ అడుగుతారు. నీకోసం చట్టాన్ని ఎలా మారుస్తాం. నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా. నేను చెప్పేది సమాజహితం కోసం. తప్పు చేసి పదే పదే ఎదురుదాడి చేయడం దారుణం. సిట్ వేశాం సిట్ విచారణ చేస్తుంది. ఈ విషయంలో మేధావులతో మీటింగ్ పెడుతున్నాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Also read

Related posts

Share via