April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: ఉదయం లేచేసరికి 12 ఇళ్ల ముందు ఎర్ర జాకెట్ ముక్క, మిరప కాయలు.. బాబోయ్



అది ఒక చిన్న పల్లెటూరు… పులిచింతల ప్రాజెక్ట్ సమీపంలో కొండల మధ్య కొలువై ఉన్న చిన్న గ్రామంలో ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతోంది. గ్రామంలో మొత్తం యాభై ఇళ్లు మాత్రమే ఉంటాయి. అయినా ఎవరూ చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియదు కాని క్షుద్ర పూజల ఆనవాళ్లు మాత్రమే తెల్లవారే సరికి ఇంటి ముందు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయ పాలెంలో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.


సోమవారం తెలతెలవారుతుండగానే వెంకటాయపాలెం ఎస్పీ కాలనీ వాసులు నిద్ర లేచారు. ఎప్పటి లాగే మిరపకాయల కోతల కోసం పొలాలకు వెళ్లాల్సి ఉంది. అయితే నిద్ర లేచి ఇంటి బయటకు వచ్చే సరికి ఎర్ర జాకెట్ ముక్కలో నిమ్మకాయలు, మిరప కాయలు, బూడిద వేసిన ప్యాకెట్ ముగ్గులో కనిపించాయి. దీంతో గ్రామంలో ఒక రకమైన అలజడి ప్రారంభమైంది. దాదాపు పన్నెండు ఇళ్ల ముందు ఇటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. క్షుద్ర పూజలు జరిగాయన్న ప్రచారం జరిగింది. అయితే పొద్దుపొడిచేసరికి ఈ సమాచారం గ్రామం మొత్తం పాకటంతో ఎవరూ చేశారన్న అంశంపై కూపీ లాగటం మొదలైంది. అయితే ఎవరికి వారు తమకు తెలియదంటే తమకు తెలియదని చెప్పారు. రాత్రి గ్రామానికి కొత్త వారు వచ్చిన ఆనవాళ్లు కూడా లేవు. దీంతో కొంతమంది స్థానికులు 100 డయల్ చేశారు.


దీంతో పోలీసులు గ్రామానికి వచ్చి ఎర్ర జాకెట్ ముక్కలో ఉంచిన వాటిని పరిశీలించి, ఫోటోలు తీసుకొని వెళ్లారు. ఒక వైపు పోలీసుల దర్యాప్తు కొనసాగతుండగానే మరొకవైపు గ్రామస్థులంతా ఒక మాటపైకి వచ్చారు. గ్రామ ఆలయంలో ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాలని నిర్ణయించారు. ఎప్పుడు లేని విధంగా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు బయటపడటంతో ఏం చేయాలో పాలు పొని పరిస్థితిలో స్తానికులు ఉండిపోయారు. ఆకతాయిలు ఎవరైనా చేసి ఉండవచ్చన్న భావన వ్యక్తం అవుతోంది. అయితే ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా పన్నెండు ఇళ్ల ముందు ఇటువంటి ఆనవాళ్లు కనిపించడంతో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. అయితే పోలీసులు గ్రామంలో బీట్స్ నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఎవరో ఆకతాయిలు చేసి ఉంటారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు

Also read

Related posts

Share via