April 19, 2025
SGSTV NEWS
Andhra Pradesh

AP News: డిప్యూటీ సీఎం పవన్‌పై కామెంట్స్ ఎఫెక్ట్.. దువ్వాడకు ఏపీ పోలీసుల నోటీసులు



వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు మరో షాక్‌ తగిలింది. వైసీపీ హయాంలో పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో దువ్వాడకు 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు. అయితే చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు దువ్వాడ.

2022లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పు చూపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..దువ్వాడ శ్రీనివాస్‌. ఈ వ్యవహారంపై గత నెలలో టెక్కలి పోలీసులకు జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు..విచారణకు రావాలంటూ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు ఇచ్చారు. నోటీసులపై స్పందించిన దువ్వాడ..కూటమి ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చిన భయపడేది లేదని స్పష్టం చేశారు. 2022లో పవన్‌ కల్యాణ్‌ నాటి సీఎం జగన్‌తో పాటు తమ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాతే తాను రియాక్ట్‌ అయ్యానని మరి పవన్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన కార్యకర్తలు తనను దుర్భాషలాడారని ఆరోపించారు..దువ్వాడ శ్రీనివాస్‌. జనసేన బెదిరింపులపై తాను పోలీసులకు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేశానని..కానీ కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలిపెట్టారని విమర్శించారు. రెండేళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలకు పోలీసులు 41 నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న దువ్వాడ.. జనసేన శ్రేణులపై తాను పెట్టిన కేసును ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.

దివ్వెల మాధురి తనను ఇబ్బందులు పెడుతున్నవారిపై రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని విమర్శించారు దువ్వాడ. కూటమి ప్రభుత్వం తమపై కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్న దువ్వాడ..మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంతా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్స్‌ చేసిన వ్యవహారంలో కూడా దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురికి గతంలోనే నోటీసులు ఇచ్చారు పోలీసులు

Also read

Related posts

Share via