October 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: వారం క్రితం ఫిర్యాదు చేశాడు.. నేడు పోలీసుల కాళ్ళకు మొక్కాడు..!

వారం రోజుల క్రితం తన ఇంట్లో చోరీకి గురైందని పోలీసులను ఆశ్రయించాడు. 40 లక్షల రూపాయల విలువైన సొమ్ము పోయిందని లబోదిబోమన్నాడు. రోజులు చూపిన చొరవతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక దక్కదనుకున్న సొత్తు కళ్ల ముందు కనిపించడంతో పొంగిపోయాడు. ఏకంగా పోలీసుల కాళ్ల మీద పడిపోయాడు. చోరీ కేసుల్లో ఏళ్ళ తరబడి పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండని ఈ రోజుల్లో వారం రోజుల్లోనే తన 50 సవర్ల బంగారాన్ని రికవరీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్‌పి ఏఆర్‌ దామోదర్‌ కాళ్ళకు మొక్కి తన సంతోషాన్ని చాటుకున్నాడు…

అతడి వయస్సు 19 ఏళ్ళు.. చేసే పనులు చూస్తే బిత్తరపోవాల్సిందే..! అతడ్ని పట్టుకున్న పోలీసులకు అదే అనుభవం ఎదురైంది. ఒంగోలులో ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డ ఓ నిందితుడ్ని విచారిస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలులోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో 40 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అంతరాష్ట్ర దొంగగా చలామణి అవుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల విలువైన సొత్తును దోచుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

పట్టుబడింది ఇలా…
ఒంగోలులోని కమ్మపాలెం కాకతీయ నగర్ చెందిన గుమ్మడి నాగార్జునరావు ఆగస్ట్ 9వ తేదీ రాత్రి బంధువుల పెళ్లికి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళాడు. తిరిగి 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి చూస్తే, ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించాడు. దొంగలు ఇంటి తలుపులు పగులగొట్టి బీరువాలో ఉన్న 50 సవర్ల బంగారు నగలు, 1.80 లక్షల రూపాయల నగదు అపహరణంకు గురైనట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తన ఇంట్లోనే చోరీ చేసి ఇంటి బయట ఉన్న తన హీరో హోండా బైక్‌పై పారిపోయాడని ఘోల్లుమన్నాడు.

బాధితుడు నాగార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు, చోరీకి గురైన మొత్తం సొమ్ము విలువ సుమారు 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. జిల్లా ఎస్‌పీ ఎఆర్‌ దామోదర్‌ నేతృత్వంలో క్రైం అడిషనల్‌ ఎస్‌పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో సోదాలు నిర్వహించారు. ఆగస్ట్ 16వ తేదీ ఒంగోలులోని సంతపేట దగ్గర ఓ లాడ్జిలో నిందితుడు ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. వెంటనే నిందితుడు పలివెల ప్రభు కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బండారం బయటపడింది. అంతేకాదు కూపీలాగితే గతంలో ఇతడు చేసిన నేరాల చిట్టా మొత్తం బయటపడింది.

జిల్లా ఎస్‌పీ కాళ్ళకు మొక్కిన బాధితుడు..
ఒంగోలులో పోలీసులకు పట్టుబడ్డ పలివెల ప్రభుకుమార్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వెదిరేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు ఉన్నట్టు తేలింది. రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్, రాజానగరం పోలీస్ స్టేషన్, రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్, తాడేపల్లి జిఆర్‌పి పోలీస్ స్టేషన్, విజయవాడ దగ్గరలోని తిరువూరు పోలీస్ స్టేషన్, హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్, నాచారం, దువ్వాడ పోలీస్ స్టేషన్, వైజాగ్ లోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్, నర్సీపట్నంలోని కోటగట్ల పోలీస్ స్టేషన్, అమలాపురం పోలీస్ స్టేషన్, ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్, రాజోలు పోలీస్ స్టేషలలో మరో 25 కేసులు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి దగ్గర నుంచి ఒంగోలులోని గుమ్మడి నాగార్జునరావు ఇంట్లో చోరీ చేసిన 40 లక్షల రూపాయల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే తన ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించి తన సొమ్మును రికవరీ చేసిన పోలీసులకు బాధితుడు నాగార్జునరావు చేతులెత్తి దండం పెట్టాడు. తన సొమ్ము తనకు దక్కేలా చేసిందుకు ఎస్‌పీ దామోదర్‌కు పాదాభివందనం చేశాడు.

ఇంటికి తాళం వేస్తే నగలు ఉంచొద్దు..
ప్రజలు శుభకార్యాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో ఇళ్ళల్లో భారీగా బంగారం, నగదు ఉంచవద్దని ప్రకాశం జిల్లా ఎస్‌పీ ఏఆర్‌ దామోదర్‌ విజ్ఞప్తి చేశారు. ఒకవేళ నగలను ఇంట్లోనే ఉంచినా సేఫ్‌ లాకర్లలో దాచుకోవాలని, వాటి తాళాలను ఇంట్లో ఉంచరాదని సూచించారు. ఇంట్లోని విలువైన బంగారు నగలు, నగదును బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. ఇళ్లల్లో దొంగతనాల నియంత్రణకు పోలీసు పరంగా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఎస్‌పీ దామోదర్ తెలిపారు. వీధుల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 ద్వారా తెలపాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలు జరుగకుండా నివారించవచ్చని సూచించారు. ఒంగోలులో ఇంట్లో జరిగిన కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్‌పీ ఏఆర్ దామోదర్ అభినందించి ప్రశంసా పత్రాలు, నగదు రివార్డ్ లు అందించారు.

Also read

Related posts

Share via