మాజీ ప్రిన్సిపల్ హత్యతో ఉలిక్కిపడిన అనంతపురం
మేనల్లుడి చేతిలో హత్యకు గురైన ఎస్కే వర్సిటీ మాజీ ప్రిన్సిపల్
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి
అనంతపురం: మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత మామను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. మాజీ ప్రిన్సిపాల్ మూర్తిరావు హత్య కేసు.. అనంతను ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈలోపు మరో విషాదం చోటు చేసుకుంది. భర్త మృతి తట్టుకోలేక.. ఆయన భార్య శోభ సైతం గుండెపోటుతో కన్నుమూశారు.
పోలీసులు తెలిపిన మేరకు… అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే దశాబ్దాల క్రితమే అనంతపురంలోని జేఎన్‌టీయూఏ ప్రధాన ద్వారం ఎదురుగా స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆరేళ్లుగా అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాల్ పనిచేశారు. ఐదారు నెలలుగా కుమార్తెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం ఆయన ఉద్యోగం మానేశారు.
భార్య కళ్లెదుటే దారుణం..
జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం ఎదురుగా మూర్తిరావుకు షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు సొంతిల్లు ఉంది. అన్నింటినీ అద్దెకు ఇచ్చేసి నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబసభ్యులతో కలసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన ఇంట్లో నివాసముంటున్న మణికంఠ ఇల్లు ఖాళీ చేసి ఆదివారం మూర్తిరావుకు ఫోన్ చేశాడు. వచ్చి ఇంటిని పరిశీలించుకుని తాళం తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో తన భార్య శోభాతో కలసి ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లారు.
అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న మేనల్లుడు ఆదిత్య లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు (58) గొంతులోకి పొడిచాడు. రెప్పపాటులోనే పలు మార్లు పొడిచి, అనంతరం అదే కత్తితో గొంతుకోశాడు. కళ్ల ముందే జరుగుతున్న దారుణం చూసి, భయపడిన శోభ గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగుతీసింది. ఇంతలో ‘అత్తా… నేనేక్కడికీ పారిపోను.. ఇక్కడే ఉంటా’ అంటూ ఆదిత్య అక్కడే ఉండిపోయాడు.

హతుడి పక్కనే కూర్చొని..
మూర్తిరావును హతమార్చిన అనంతరం నేరుగా ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు ఆదిత్య వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, నేరుగా మూర్తిరావు మృతదేహం వద్దకు చేరుకుని పక్కనే కూర్చొని ఉండిపోయాడు. ఇంతలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం మూర్తిరావు ఇంటికి ఎదురుగానే బ్యాచ్‌లర్‌లా పరిచయం చేసుకున్న ఆదిత్య ఓ గదిని అద్దెకు తీసుకుని అందులోకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే మూర్తిరావును హత్య చేయాలని కుట్ర పన్నినట్లుగా సమాచారం. తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వన్‌లైన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. నిందితుడిని సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు.
వివాదరహితుడు
మేనల్లుడి చేతిలో కిరాతకంగా మూర్తిరావు హత్యకు గురికావడం.. అది జీర్ణించుకోలేక శోభ గుండెపోటుతో కన్నుమూయడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. జేఎన్‌టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి పీహెచ్‌డీ పొందిన మూర్తిరావు పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో నిష్ణాతుడు. మంచి పరిశోధకుడు. అందరినీ ఆప్యాయంగా పలకరించే మూర్తిరావు హత్యకు గురైన విషయం తెలియగానే నగరం ఉలిక్కిపడింది. ఆయనను కడసారి చూసేందుకు జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లు, అనంతలక్ష్మి కళాశాల విద్యార్థులు బారులు తీరారు. కాగా, మూర్తిరావు భార్య శోభ… శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పినదర్రి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు ఉజ్వల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, కుమార్తె వైష్ణవి బెంగళూర్‌లో బ్యాంక్ ఉద్యోగిగా స్థిరపడ్డారు.
Also read
- ‘నేను చచ్చిపోయినా బాగుండేది’.. అమీన్పూర్ ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!
- హెల్త్ సూపర్వైజర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సుపారీ ఇచ్చి మరీ భార్య దారుణంగా!
- Lady Aghori-Sri Varshini: అఘోరీ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. వర్షిణిని రప్పా రప్పా ఈడ్చుకెళ్లిన ఫ్యామిలీ
- ప్రయాణిస్తున్న రైలు వాష్‌రూమ్‌లో వేధింపులు.. వీడియోలు రికార్డింగ్
- ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని రెండవ బ్లాక్‌లో