SGSTV NEWS
Andhra Pradesh

Anantapur: సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి.. బిల్లు చెల్లించలేదని మృతదేహం అప్పగించని ఆస్పత్రి

బిల్లు చెల్లించకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మృతదేహం అప్పగించలేదు. సాయం కోసం బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.

చెన్నై, : బిల్లు చెల్లించకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది మృతదేహం అప్పగించలేదు. సాయం కోసం బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నగదాని మాధురి(27) ఐటీ ఉద్యోగిని. కొన్నాళ్లుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం ఏప్రిల్లో చెన్నై తీసుకొచ్చారు. సమీప బంధువు ఇంట్లో ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. క్షయ ఉన్నట్లు గుర్తించి కొద్దిరోజులు చికిత్స తర్వాత డిశ్చార్జి చేశారు. ఇంటికెళ్లిన ఆమె మే 6న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పోరూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

మూత్రపిండాలు, కాలేయంలో ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉందని, క్షయ కూడా బాగా ముదిరిందని వైద్యులు గుర్తించారు. ఐసీయూలో చికిత్స అందించారు. సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించడంతో ఆర్థికసాయం కోసం దాతలను అభ్యర్థించారు. రూ.60వేలు వరకు అందింది. ఆరోగ్య బీమా ద్వారా రూ.5 లక్షలు, బంధుమిత్రుల సాయంతో మరో రూ.6 లక్షలతో పాటు మరికొంత చెల్లించారు. వైద్యానికి మాధురి ఆరోగ్యం సహకరించని నేపథ్యంలో బుధవారం ఉదయం మృతి చెందింది. సుమారు రూ.7.50 లక్షలు వరకు బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో మృతదేహాన్ని అప్పగించలేదని మాధురి తండ్రి నగదాని రాజశేఖర్ ‘న్యూస్టుడే’కు తెలిపారు. మృతదేహం తీసుకెళ్లడానికి దాతలు సాయం అందించాలని కోరారు.

Also read

Related posts

Share this