అమరావతి : తిరుమల లడ్డు తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ లేదని సిబిఐ ఇచ్చిన నివేదికలో ఎక్కడుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గురువారం కూటమి పార్టీల సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దీనికి జనసేన అధ్యక్షులు డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్, బిజెపి అధ్యక్షులు పివిఎన్.మాధవ్, మంత్రి సత్యకుమార్‌యాదవ్, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారధి, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. లడ్డూ కల్తీ వివాదంపైనా, ఛార్జిషీటులో ఉన్న అంశాలపైనా, తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు. అనంతరం ఈ సమావేశంలో పాల్గన్న నేతలు అందరు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ స్థాయిలో కూటమి నేతలందరు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కల్తీ లేదంటూ క్లీన్‌చిట్ ఎవరిచ్చారని అన్నారు. పామాయిల్, రసాయనాలతో నెయ్యి తయారుచేసి దాన్నే సరఫరా చేసి ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారని అన్నారు. పాల నుండి తయారు చేసిన వెన్న కాకుండా రసాయనాలు, పామాయిల్ కలిపి నెయ్యి తయారు చేసి దాన్నే సరఫరా చేశారని తెలిపారు.శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటుచేసుకుందని, ఏడు కొండలను రెండు కొండలని చెప్పారని, దేవస్థానానికి వెళ్లే సమయంలో కనీసం డిక్లరేషన్ కూడా ఇవ్వని వారు తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలూ దెబ్బతిన్నాయని, అందువల్లే తిరుమల లడ్డూపైనా విచారణకు ఆదేశించామని తెలిపారు. అర్హత లేని డెయిరీలకు టెండర్లు ఇచ్చేందుకు నిబంధనలు సడలించారని పేర్కొన్నారు. 2022లోనే నెయ్యిలో కల్తీ జరుగుతోందని సిఎఫ్‌టిఆర్‌ఐ చెప్పినా పట్టించుకోకుండా యధేచ్చగా సరఫరా చేశారని పేర్కొన్నారు. సిట్ నివేదికలో అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇష్టానుసారం బూతులు తిట్టినా భరించానని, ఏమి చేసినా నిస్సహాయంగా మిగిలిపోవాలా అని ప్రశ్నించారు. సిబిఐ నివేదికలో కల్తీజరగలేదని చెప్పకపోయినా కరుడుగట్టిన నేరస్తులు అసత్యాన్ని నిజమని నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారని తెలిపారు. తిరుమలలో తయారయ్యే లడ్డూ ప్రపంచంలో మరెక్కడా చేయలేరని పేర్కొన్నారు. 2022లో కల్తీపై నివేదిక వచ్చినా చర్యలు తీసుకోలేదంటే తెలిసే కల్తీనెయ్యి సరఫరా చేశారని, బోర్డు ఛైర్మన్‌కు, పర్చేజ్ కమిటీకి తెలిసే కల్తీ నెయ్యి సరఫరా నిర్ణయం జరిగిందని అన్నారు. అలాగే అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం డిక్లరేషన్‌పై సంతకం చేసి వెళ్లేవారని, టిటిడి నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని, కానీ గత సిఎం చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించారని అన్నారు. ఈ అంశంపై పీఠాధిపతులతోనూ చర్చించి ముందుకు వెళతామని అన్నారు. టిటిడి విషయంలో చేసిన మహాపాపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు.
జంతుకొవ్వు ఉందని ఎన్‌డిడిబి రిపోర్టు చెప్పింది : పవన్‌కల్యాణ్
నెయ్యి పేరుతో సరఫరా చేసిన ద్రావకడంలో ఎన్‌డిడిబి ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఫిష్‌అయిల్, బీఫ్ అయిల్, పందికొవ్వు, లాంటివి ఉన్నాయని రిపోర్టులో ప్రస్తావించారని, అయితే స్నుతమైన అంశం అవడం వల్ల బయటపెట్టేందుకు సంశయించామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యితో చేసిన లడ్డులనే అయోధ్య రామమందిరానికి పంపించారని, విశ్వాసాలపై దెబ్బతీశారని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ మాట్లాడుతూ పాలసేకరణలేని డెయిరీ నుండి నెయ్యి సేకరించి దానితోనే సింథటిక్ నెయ్యి తయారు చేశారని తెలిపారు. అంతకుముందు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ నెయ్యిలో కల్తీ జరిగిన విధానాన్ని, వేర్వేరు లేబరేటరీలు ఇచ్చిన నివేదికలు, జంతువుల కొవ్వు కలిసింది అనేందుకు ఉన్న పలు ఆధారాలను బయటపెట్టారు. అలాగే నెయ్యి కల్తీకి వాడిన పదార్థాలు దక్షిన కొరియా నుండి దిగుమతి చేసుకున్నారని పేర్కొన్నారు.
Also read
- చిన్నారికి చాక్లెట్ కావాలంటే కొనిపెట్టారు.. వామ్మో.. నోట్లో పెట్టగానే పేలిపోయింది.. చివరకు
- శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలు తెలుసా..?
- నేటి జాతకములు..7 ఫిబ్రవరి, 2026
- పోలీసులపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాడి
- కళ్లలో కారం కొట్టి.. కత్తితో గొంతు కోసి!





