October 16, 2024
SGSTV NEWS
CrimeTelangana

Adulterated Liquor: ఖరీదైన విందుల్లో కల్తీ  బ్రాండ్ల మద్యం


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు సమీపంలో ఎక్సైజ్ సిబ్బంది గత ఆగస్టు 14న విశ్వసనీయ సమాచారంతో ఒక కారును తనిఖీ చేశారు.

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు సమీపంలో ఎక్సైజ్ సిబ్బంది గత ఆగస్టు 14న విశ్వసనీయ సమాచారంతో ఒక కారును తనిఖీ చేశారు. అందులో డిఫెన్స్ మద్యంగా చెబుతున్న

రూ.11 లక్షల విలువైన 42 సీసాలు లభించాయి. వాటిని పరిశీలించగా బ్రాండ్ల కల్తీ జరిగినట్లు తేలింది. కర్ణాటకలోని బీదర్కు చెందిన అంబాదాస్, అభిషేక్ వాటిని తరలిస్తున్నట్లు తేలడంతో అరెస్టు చేశారు. ఆ కేసులో ఎక్సైజ్ అధికారులు లోతుగా ఆరా తీయడంతో ఖరీదైన బ్రాండ్ల సీసాల్లో తక్కువ ధర మద్యాన్ని నింపి విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ తరహా మద్యాన్ని ముఖ్యంగా వివాహాలు, జన్మదిన వేడుకల్లాంటి విందులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి వేడుకల్ని నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల సిబ్బంది ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఒక్కో పార్టీలో రూ.20 లక్షల వరకు మద్యం వినియోగిస్తున్న క్రమంలో ఖరీదైన బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలు గుర్తించాయి. ఖరీదైన మద్యం బాటిళ్ల లేబుళ్లను ఒడుపుగా తొలగించి తక్కువ ఖరీదు మద్యాన్ని వాటిలో నింపి, మళ్లీ లేబుళ్లను బిగిస్తున్నారు.

ఈవెంట్లలో కొంత మోతాదులో మద్యం వినియోగించిన అనంతరం ఈ కల్తీబ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అప్పటికే నిషా ఎక్కిన తర్వాత వినియోగదారులు కల్తీబ్రాండ్లను కనిపెట్టలేరనే ఉద్దేశమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే భారీ వేడుకలు జరిగే కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్స్లపై ఎక్సైజ్ అధికారులు నిఘా విస్తృతం చేశారు. ఖరీదైన బ్రాండ్ల లేబుళ్లను ట్యాంపరింగ్ చేసినట్లు అనుమానముంటే టోల్ ఫ్రీ నంబర్ 18004252523కు ఫిర్యాదు చేయాలని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.

Also read

Related posts

Share via