June 29, 2024
SGSTV NEWS
Famous Hindu Temples

Adhi Vinayaka ప్రపంచంలోనే తొండం లేని ఏకైక వినాయక దేవాలయం ఎక్కడుందో తెలుసా..

తొండం లేని వినాయకుడి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? మనిషి రూపంలో ఉండే వినాయకుడికి ఓ ప్రత్యేక దేవాలయం ఉందని మీకు తెలుసా… ఈ సందర్భంగా మానవ రూపంలో వినాయకుడి దేవాలయం ఎక్కడుంది.. ఈ దేవాలయం ప్రత్యేకతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

Adhi Vinayagar in Tamilnadu వినాయకుడు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది తొండంతో ఉండే గజ ముఖం, నిండుగా ఉండే పొట్ట.. పెద్ద చెవులు ఇలా గణపతి ఆకారం అందరి దేవుళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఏ గుడిలో అయినా.. ఏ ఫోటోలో అయినా మనకు తొండం ఉండే గణపయ్య దర్శనమిస్తాడు. అయితే తొండం లేని వినాయకుడి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా? మనిషి రూపంలో ఉండే వినాయకుడికి ఓ ప్రత్యేక దేవాలయం ఉందని మీకు తెలుసా… ఈ సందర్భంగా మానవ రూపంలో వినాయకుడి దేవాలయం ఎక్కడుంది.. ఈ దేవాలయం ప్రత్యేకతలేంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

బాల గణపతి రూపంలో..

తమిళనాడు రాష్ట్రంలోని ఈ దేవాలయంలో మానవ రూపంలో వినాయకుడు దర్శనమిస్తాడు. ఈ గుడి తొండం లేని ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఇది తిలతర్పణ పురి గ్రామంలో ముక్తీశ్వరా ఆలయ ప్రాంగణంలో ఉంది. దీన్నే ఆది వినాయక ఆలయం అని పిలుస్తారు. మానవ రూపంలో కనిపించే ఈ దేవుడిని ‘నర ముఖ’ గణపతిగా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూజలు జరుగుతాయి.

పురాణాల ప్రకారం..

పితృదేవతల కోసం అనేక చోట్ల తర్పణాలు వదిలినా ప్రయోజనం లేకపోతే, పరిహారం కోసం మీరు దర్శించి తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయంగా ప్రఖ్యాతి గడించింది. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించాడు.

పితృదోషాలు పోవాలంటే..

పితృదోషాలతో బాధపడేవారు ఈ నరముఖ దేవాలయాన్ని దర్శిస్తే కచ్చితంగా దోషాలన్నీ తొలగిపోతాయట. శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రధానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్ధించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ఊళ్లోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. ఆ ఊరు అందుకనే అప్పటి నుంచి తిలతర్పణపురిగా మారింది.

తిలతర్పణపురి అంటే..

తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. రాముడు తిలలు వదిలిన ప్రాంతం కాబట్టి, శ్రీరాముడు తన తండ్రికి నాలుగు పిండాలు(అన్నం ముద్దలు) పెట్టగా వారు లింగాల రూపంలో మారడం జరిగింది. అందుకే పితృ దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందగలరని పండితులు చెబుతున్నారు

సరస్వతి, శివుడికి పూజలు

ఈ ఆది వినాయకుని ఆలయంలో గణేశుడితో పాటు పరమేశ్వరుడిని, సరస్వతి దేవిని కూడా పూజిస్తారు. ప్రతి సంకష్ఠి చతుర్థి నాడు మహా గురువు అగస్త్యుడు స్వయంగా ఆది వినాయకుడిని పూజిస్తారని అక్కడి భక్తులందరూ నమ్ముతారు. ఈ వినాయకుడిని పూజించడం వల్ల కుటుంబ సంబంధాలలో శాంతి నెలకొంటుందని, తమ పిల్లల తెలివితేటలు పెరుగుతాయని కూడా నమ్ముతారు

గురువారం ప్రత్యేక పూజలు..

ఈ చిన్న ఆలయం లోపల ఆది శంకరుడు, బుుషి వేదవ్యాస, గాయత్రీ దేవి, సదాశివ బ్రహ్మేంద్ర, సంతపట్టినాథ్ విగ్రహాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గురువారం రోజున నర ముఖ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు దాదాపు 83 సంవత్సరాలుగా ఇక్కడ జరిగే వార్షిక సంగీత ఉత్సవాల్లో ప్రముఖ సంగీత విధ్వాంసులు ఎందరో పాల్గొన్నారు.

Related posts

Share via