July 3, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024CrimeLatest News

సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు

విజయవాడలో రోడ్ నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు.

ఏ1గా చేర్చిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

-అమరావతి, – విజయవాడ నేరవార్తలు: విజయవాడలో రోడ్ షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. అజిత్సాంగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ అలియాస్ సత్తిని ఏ1గా చేర్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం గురువారం మధ్యాహ్నం నగరంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి రమణారెడ్డి ఎదుట నిందితుడిని హాజరుపర్చారు. ఈ నెల 13 రాత్రి విజయవాడ శివారు సింగ్ నగర్ డాబాకొట్ల రోడ్డులో ‘మేమంతా సిద్ధం’ రోడ్ సాగుతుండగా రాయి విసిరిన ఘటనలో సీఎం జగన్ నుదుటి మీద గాయమైంది. పక్కనే ఉన్న మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస కు అదే రాయి తగిలి కంటికి స్వల్ప గాయమైంది. ఈ ఘటనపై వెలంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగ్ నగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 120 (బి) (నేరపూరిత కుట్ర), సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సతీషే ముఖ్యమంత్రి పైకి రాయి విసిరినట్లు తేల్చారు. 13వ తేదీ రాత్రి 8.04 గంటలకు రోడ్ షో డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు చేరిన సమయంలో సతీష్, తన జేబులో నుంచి పదునైన కాంక్రీట్ రాయిని తీసి సీఎంను లక్ష్యంగా చేసుకుని విసిరినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాయితో దాడి చేయాల్సిందిగా ఏ2 ఇతడిని పురిగొల్పినట్లు అందులో ప్రస్తావించారు. కోర్టులో వాదనల అనంతరం న్యాయాధికారి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.

చిన్న గాయానికే హత్యాయత్నం కేసా?

ఈ ఘటనలో ముఖ్యమంత్రికి తగిలింది చిన్న గాయమేనని, ప్రాథమిక చికిత్స అనంతరం రోడ్ యథావిధిగా సాగిందని, ఈ గాయానికే పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేయడం తగదని నిందితుడి తరపు న్యాయవాదులు సలీం, రాజశేఖర్ వాదించారు. సెక్షన్ 307కు బదులుగా 323 కిందకు మార్చాలని కోరారు. నిందితుడికి రాజకీయ నేపథ్యం లేదని, సాధారణ వ్యక్తి అని.. ముఖ్యమంత్రితో శత్రుత్వం లేదని తెలిపారు. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ డ్రామాలో భాగంగానే రాయి దాడిని తెరపైకి తీసుకొచ్చారని వాదించారు. ఎన్నికలలో సానుభూతి కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రి పైకి గురిచూసి రాయితో దాడి చేశారనడం సత్యదూరమని, ఇది నమ్మశక్యంగా లేదని చెప్పారు.

ఉద్దేశపూర్వకంగానే దాడి…

ముందస్తు కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రిపై నిందితుడు సతీష్ రాయితో దాడి చేశారని ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ కృష్ణకిషోర్ వాదించారు. దీని వెనుక నేరపూరిత కుట్ర ఉందని, దీన్ని వెలికితీయాలంటే నిందితుడికి రిమాండ్ విధించాలని కోరారు. ఏ2 ప్రోద్బలంతోనే దాడికి పాల్పడ్డారని ఏపీపీ వాదించారు. సీఎంను అంతం చేసేందుకే ఈ దాడి జరిగిందన్నారు. 2021లో మైనర్గా ఉండగానే సెల్ఫోన్ దొంగతనం కేసులో 6 నెలలు జువెనైల్ హోంకు వెళ్లి వచ్చాడని తెలిపారు. నిందితుడి పుట్టిన తేదీపైనా ఇరువర్గాల మధ్య వాడివేడిగా వాదనలు సాగాయి. సతీష్ 2005లో జన్మించినట్లు ధ్రువీకరణ పత్రాన్ని పోలీసులు కోర్టులో సమర్పించారు. దీని ప్రకారం మేజర్ అని ఏపీపీ వాదించారు. దీన్ని నిందితుడి తరఫు న్యాయవాదులు తిప్పికొడుతూ.. ఆధార్లో ఉన్న తేదీ ప్రకారం మైనర్ అని వాదించారు. పుట్టిన సమయంలో నమోదుచేసిన తేదీనే  పరిగణనలోకి తీసుకుంటామని న్యాయాధికారి చెప్పడంతో మేజర్గానే తేల్చారు. రిమాండ్ విధించిన తర్వాత.. నిందితుడిని నెల్లూరులోని కేంద్ర కారాగారానికి పోలీసులు తరలించారు.

సెర్చ్ వారంట్ పిటిషన్కు అనుమతి

ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురి ఆచూకీ నిమిత్తం న్యాయవాది సలీం గురువారం ఉదయం కోర్టులో సెర్చ్ వారంట్ పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్ ను న్యాయాధికారి రమణారెడ్డి అనుమతించారు. ఈ మేరకు అడ్వొకేట్ కమిషనర్గా న్యాయవాది శ్రీకాంత ను నియమించారు. సింగ్నగర్ స్టేషన్, పశ్చిమ ఏసీపీ కార్యాలయం, పోలీసు కమిషనర్ కార్యాలయంలో తనిఖీలకు మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. దీని ప్రకారం ఈ మూడుచోట్ల అడ్వకేట్ కమిషనర్ తనిఖీలు చేశారు. ఈ వారంట్ అమలు చేసేలోగానే నిందితుడు సతీష్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. నలుగురు మైనర్లను విడిచిపెట్టారు. దుర్గారావును మాత్రం తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. మూడు ప్రాంతాల్లో ఎక్కడా దుర్గారావు ఆచూకీ కనిపించలేదు. ఈ మేరకు శ్రీకాంత్.. కోర్టుకు శుక్రవారం నివేదిక అందజేయనున్నారు. 

Also read

Related posts

Share via