February 4, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

ఏస్ నెక్స్ట్ జెన్, గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు


• ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన అధికారులు

• హైదరాబాద్, మచిలీపట్నంలో కొనసాగిన తనిఖీలు

• పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం

• బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై దృష్టి

• కేటీఆర్ కు తాజాగా ఈడీ సమన్లు



మచిలీపట్నం): ఫార్ములా – ఈ రేసు కేసులో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఇప్పటివరకు రేసు నిర్వహణ, నిధుల మళ్లింపులో నిబంధనల అతిక్రమణ, హెచ్ఎండీఏ అధికారిక ఖాతాల నుంచి విదేశీ కంపెనీలకు నిధుల మళ్లించడంపై ఫోకస్ పెట్టిన అధికారులు, తాజాగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. తాజాగా తెరపైకి వచ్చిన క్విడ్ ప్రోకో కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలకు కొద్ది నెలల ముందే బీఆర్ఎస్ కు గ్రీన్కో అనుబంధ సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయలు వచ్చాయనే సమాచారంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ఫార్ములా ఈ రేసుకు మొదట్లో స్పాన్సర్ గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు దాని అనుబంధ సంస్థ గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్లో సైబర్ టవర్స్లో, మచిలీపట్నంలోని గ్రీన్కో కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.

సహకరించని సిబ్బంది!

ఏసీబీ అధికారుల తనిఖీలకు ఆయా సంస్థల సిబ్బంది ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. మాదాపూర్ సైబర్ టవర్స్  లోని గ్రీన్కో కార్యాలయంలో సోదాలకు  సంస్థ సిబ్బంది మొదట అనుమతించలేదు. అధికారులు సెర్చ్ వారెంట్ వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. ఇక అదే ప్రాంతంలోని ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో అధికారులు సోదాలు జరిపారు. పలు కీలక పత్రాలు, పైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న గ్రీన్ కో అనుబంధ సంస్థలైన ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయాల్లోనూ మంగళవారం రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. పలు ఫైళ్లతో పాటు హార్డ్ డిస్క్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మచిలీపట్నంలో కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న గ్రీన్ కో కంపెనీకి చెందిన గెస్ట్ హౌస్ లొ కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

కేటీఆర్ కు తాజాగా ఈడీ సమన్లు

ఫార్ములా-ఈ కారు రేస్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్కు ఈడీ అధికారులు మరోమారు సమన్లు జారీ చేశారు. వాస్తవానికి కేటీఆర్ మంగళవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. తనకు మరికొంత సమయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్కు మంగళవారం మరోమారు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. కాగా ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం..ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్, హెచ్ఎండీఏ మాజీ సీఈ బీఎల్ఎన్ రెడ్డి బుధవారం ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

Also read

Related posts

Share via