April 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

విషాదం మిగిల్చిన విహారం.. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, నిడదవోలు  : రాజమహేంద్రనగరంలో స్నేహితులతో గడిపి సాయంత్రానికి ఇంటికి వస్తానన్న మాటలు ఆ తల్లిదండ్రుల చెవిలోనే ఉన్నాయి. కుమార్తె రాకకోసం గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్న తాతా, నాయనమ్మ, కన్నవారికి పిడుగులాంటి వార్త ఎదురయ్యింది. సరదాగా తిరిగేందుకు వచ్చిన ఆ యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన బూరుగుపూడి జంక్షన్లో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన జుజ్జవరపు వెంకటదీప్తి(18) సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఇంటికి వెళ్లే క్రమంలో నగరాన్ని చూడాలని శుక్రవారం 9 మంది స్నేహితులతో నాలుగు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. సాయంత్రం కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి బయలుదేరారు. 
ఈ క్రమంలో బూరుగుపూడి జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న దీప్తి ఎదురుగా వస్తున్న టాటా ఐసర్ వ్యాన్ ను ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. వెనక కూర్చున్న అనూషకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీప్తి తండ్రి వెంకటేశ్వరరావు వ్యవసాయం చేస్తారు. తల్లి గీత గృహిణి. అన్నయ్య బాల వంశీ  పంజాబ్ లోని ఎల్పీ యూనివర్శిటీలో బీటేక్ సీఎస్ఈ మూడో ఏడాది చదువుతున్నారు. ఇదిగో వచ్చేస్తున్నా అంటూ విగతజీవిగా మారిన దీప్తిని చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి.

Also read

Related posts

Share via