SGSTV NEWS online
CrimeTelangana

హైవే గస్తీలో.. కానిస్టేబుల్ దుర్మరణం.



చౌటుప్పల్ గ: అసలే విజయవాడ హైవే.. అందులోనూ సంక్రాంతి పండగ రద్దీ.. అర్ధరాత్రి సైతం ట్రాఫిక్ జామ్ కాకుండా చూసేందుకు ఆయన గస్తీ నిర్వహిస్తున్నారు. అలా విధులు నిర్వహిస్తుండగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డుమీదే ప్రాణాలు విడిచారు. రోడ్డు ప్రమాదంలో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు.. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగేళ్లుగా కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోల నరేశ్ కుమార్ (38) విధుల్లో భాగంగా మరో కానిస్టేబుల్ భరద్వాజ్తో కలిసి సోమవారం రాత్రి నుంచి బైక్పై హైవే పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ధర్మోజీగూడెంలోని భారత్ పెట్రోల్ బంకు ఎదురుగా విజయవాడ మార్గంలో వాహనాలు నిలిపినట్లు గుర్తించారు.వాటిని తీయాలని డ్రైవర్లకు చెప్పేందుకు నరేశ్ కుమార్ జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Also read

Related posts