November 21, 2024
SGSTV NEWS
National

సామాన్యులకు వినోదం భారం



ధరలు పెంచనున్న ఛానళ్లు

త్వరలోనే 5-8 శాతం ధరల పెంపు..!
వయోకామ్‌ 18 ఏకంగా 25% వడ్డింపు

బ్రాడ్‌కాస్ట్‌ పరిశ్రమ వర్గాల వెల్లడి 

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మూడో సారి మోడీ సర్కార్‌ గద్దెను ఎక్కనుంది. అదే క్రమంలో ఎప్పటిలాగే ప్రజలపై ధరల భారాలను పెంచనున్నట్లు స్పష్టమవుతోంది. సామాన్యులు కుటుంబంతో కలిసి వినోదాలు పొందే టివి ఛానళ్లు త్వరలోనే భారం కానున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ఛానళ్ల ధరల పెంపునకు కసరత్తు జరుగుతుందని బ్రాడ్‌కాస్ట్‌ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. టివి ఛానళ్ల చందా రుసుములు 5-8 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. డిస్నీ స్టార్‌, వయాకామ్‌ 18, జి ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా వంటి బ్రాడ్‌కాస్టర్లు తమ ఛానెళ్ల ధరల్ని పెంచడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ప్రముఖ బ్రాడ్‌కాస్టర్లు జనవరిలో తమ బేస్‌ రేట్లను సుమారు 10 శాతం పెంచాలని నిర్ణయించాయి. అదే విధంగా భారతీయ క్రికెట్‌ హక్కులను చేజిక్కించుకోవడంతో సాధారణ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెళ్ల కంటే వయోకామ్‌18 అత్యధికంగా 25 శాతం పైగా రేట్లును పెంచింది. కొత్త ధరలు ఫిబ్రవరి ఒక్కటి నుంచే అమలులోకి రావాల్సి ఉంది. అయితే.. ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్‌ ఇందుకు అనుమతులు ఇవ్వక పోవడంతో ట్రారు ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేసింది. ఎన్నికల తర్వాత పెంపునకు అంతర్గతంగా అంగీకారానికి వచ్చారని సమాచారం. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో రేట్లు పెంచేందుకు యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. త్వరలోనే మిగతా బ్రాడ్‌కాస్టర్స్‌ కూడా ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది. బ్రాడ్‌కాస్టర్లకు ట్రారు అనుమతులిస్తే సామాన్యుడిపై టివి ఛానళ్ల పిడుగు భారం పడనుంది

Related posts

Share via