SGSTV NEWS
CrimeTelangana

బోల్తా పడిన కారులో కనిపించిన రెండు బ్యాగులు.. ఏంటోనని చెక్ చేయగా దెబ్బకు షాక్..

ఎన్నికల సంఘం.. సోమవారం జరిగే ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.. అదే సమయంలో పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓ వైపు పోలింగ్‌కు ఏర్పాట్లు.. మరో వైపు ఎక్కడికక్కడ తనిఖీలు… దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో నగదు తరలించడాన్ని పోలీసులు గుర్తిస్తున్నారు.. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. ఆదివారం.. ఖమ్మం జిల్లాలో కోటి 5 లక్షల రూపాయల నగదును గుర్తించారు పోలీసులు.. కూసుమంచి మండలం దేవుని తండా దగ్గర కారు అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో కారు డిక్కీ ఓపెన్ చేసి తనిఖీ చేశారు పోలీసులు.

అందులో రెండు బ్యాగులను గుర్తించారు.. అనంతరం వాటిని చెక్ చేయగా.. నోట్ల కట్టలు బయటపడ్డారు. బ్యాగుల్లో నగదును లెక్కించి.. కోటి ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో డబ్బు ఎవరిది? ఎక్కడికి వెళ్తుంది అనే కోణంలో కూసుమంచి పోలీసులు కూపీ లాగుతున్నారు.

కాగా.. మరికొన్ని గంటల్లో ఎన్నికలు జరగుతున్న వేళ కారులో ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది.

Also read

Related posts

Share this